Domestic Season 2023-24 Schedule: దేశవాలీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ విడుదల..
బీసీసీఐ 2023-24 దేశవాలీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ను విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: బీసీసీఐ 2023-24 దేశవాలీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ సీజన్ 28 జూన్ 2023 నుంచి 14 మార్చి 2024 వరకు సాగనుంది. దులీప్ ట్రోఫీతో ప్రారంభమయ్యే ఈ సీజన్లో మొత్తం 1846 మ్యాచ్లు జరుగనున్నాయి. జూన్ 28న మొదలయ్యే దులీప్ ట్రోఫీ జులై 16న ముగుస్తుంది. ఆ వెంటనే జులై 24-ఆగస్ట్ 4 మధ్యలో దియోధర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్-ఈస్ట్) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీల తర్వాత అక్టోబర్ 1 నుంచి 5 వరకు రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర-రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ జరుగుతుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్) లు మొదలవుతాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుండగా.. విజయ్ హజారే ట్రోఫీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. 2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలవుతుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. మహిళల క్రికెట్ విషయానికొస్తే.. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు సాగుతుంది.