అదరగొట్టిన రామ్‌కుమార్, శ్రీరామ్.. డేవిస్ కప్‌లో పాకిస్తాన్‌పై 2-0తో ఆధిక్యం
ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ కోసం 60 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన భారత బృందం శుభారంభం చేసింది.
దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ కోసం 60 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన భారత బృందం శుభారంభం చేసింది. ఇస్లామాబాద్‌లో శనివారం జరిగిన వరల్డ్ గ్రూపు-1 ప్లే ఆఫ్స్ ఫస్ట్ రౌండ్ టై పోరులో పాకిస్తాన్‌పై రెండు సింగిల్స్ మ్యాచ్‌లను నెగ్గి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మొదటి మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 6-7, 7-6, 6-0 తేడాతో పాక్ ఆటగాడు ఖురేషీ ఐసమ్ ఉల్ హక్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన అతను ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో సెట్‌ను టైబ్రేకర్ దక్కించుకుని పోటీలోకి వచ్చిన రామ్‌కుమార్ నిర్ణయాత్మక మూడో సెట్‌ను ఏకపక్షంగా గెలుచుకుని విజేతగా నిలిచాడు. అనంతరం రెండో సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ సత్తాచాటాడు. గంటా 15 నిమిషాల్లోనే పాక్ ప్లేయర్ అక్యూల్ ఖాన్‌పై 5-7, 3-6 తేడాతో వరుస సెట్లను నెగ్గాడు.
నేడు డబుల్స్..రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు
రెండు రోజులపాటు ఈ మ్యాచ్ జరగనుంది. ఆదివారం డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని-యుకీ బాంబ్రీ జోడీ.. బర్కతుల్లా-ముజామిల్ మొర్తజా జంటతో తలపడనుంది. ఆ తర్వాత రామ్‌కుమార్, శ్రీరామ్ రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడతారు. నేడు మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి నెగ్గినా మ్యాచ్ భారత్ సొంతమవుతుంది. కాగా, గతంలో పాక్‌తో ఏడు సార్లు తలపడగా అన్నింటా భారత్ నెగ్గింది. ఇంతకుముందు 1964లో చివరిసారిగా భారత జట్టు పాక్‌లో పర్యటించింది. అప్పుడు 4-0తో విజయం సాధించింది. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాక్‌కు వెళ్లలేదు. 2019లో తటస్థ వేదికపై మ్యాచ్ జరిగింది. ఈ సారి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ తటస్థ వేదికకు అనుమతించకపోవడంతో 60 ఏళ్ల తర్వాత భారత్ పాక్‌లో అడుగుపెట్టింది.