తిలక్.. నీకు మంచి కెరీర్ ఉంది : Ambati Rayudu

వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో తెలుగు కుర్రాడు, హైదరాబాద్‌ క్రికెటర్ తిలక్ వర్మ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

Update: 2023-07-06 14:58 GMT

హైదరాబాద్ : వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో తెలుగు కుర్రాడు, హైదరాబాద్‌ క్రికెటర్ తిలక్ వర్మ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికవడంపై క్రికెట్ అభిమానులతోపాటు మాజీ క్రికెటర్ల నుంచి తిలక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీమ్ ఇండియా మాజీ క్రికెట్ అంబటి రాయుడు సైతం గురువారం ట్విటర్ వేదికగా తిలక్‌కు అభినందనలు తెలిపాడు. ‘టీమ్ ఇండియాకు ఎంపికైన తిలక్‌కు కంగ్రాట్స్. టీమ్ ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో నీకు మంచి కెరీర్‌ ఉంటుందని భావిస్తున్నా. ఆల్ ది బెస్ట్ తిలక్.’ అని రాయుడు ట్వీట్ చేశాడు.

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం స్పందిస్తూ.. ‘భారత టీ20 జట్టు నుంచి తొలిసారిగా పిలుపు అందుకున్న తిలక్‌కు అభినందనలు. తిలక్ టీమ్ ఇండియాకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. అతడితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా.’ అని సూర్య ట్వీట్ చేశాడు. కాగా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్, తిలక్ వర్మ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సూర్యకుమార్ డిప్యూటీగా ఎంపికయ్యాడు.


Similar News