చిరకాల ప్రత్యర్థితో పోరు.. పసిబిడ్డతో వచ్చిన పాక్ మహిళా జట్టు కెప్టెన్
దిశ, వెబ్‌డెస్క్: ఆడుతున్నది చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్లు, అయితేనేం.. మాతృత్వం ముందు ఆ వైరం చిన్నబోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టుతో తలపడటానికి న్యూజిలాండ్ వచ్చిన పాక్ మహిళా
దిశ, వెబ్‌డెస్క్: ఆడుతున్నది చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్లు, అయితేనేం.. మాతృత్వం ముందు ఆ వైరం చిన్నబోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టుతో తలపడటానికి న్యూజిలాండ్ వచ్చిన పాక్ మహిళా జట్టు కెప్టెన్ బిస్మాహ్ మరూప్ ఆదివారం పసిబడ్డను చేతుల్తో పట్టుకుని మైదానంలోకి వస్తున్న దృశ్యం క్రీడాభిమానులను విశేషంగా ఆకర్షించింది. బేబీ ఇన్ ఆర్మ్స్ అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఆ ఫోటో లక్షలమంది నెటిజన్లను కదిలిస్తోంది. ఉయ్యాలలూపే చేతులు ప్రపంచాన్నే పాలిస్తాయన్నది తల్లుల ప్రాధాన్యతను వివరించే అతిశక్తివంతమైన ప్రకటన. న్యూజిలాండ్ లోని మౌంట్ మౌంగానుయ్ లోని బే ఓవల్ మైదానంలో భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌తో తలపడటానికి ముందుగా ఆదివారం ఉదయం నెలల బిడ్డను చేతులతో పట్టుకుని మైదానంలోకి వచ్చిన పాక్ జట్టు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ ఫోటోను చూస్తూ నెటిజన్లు పరవశించిపోయారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందంటే దాయాది పాకిస్తాన్ కెప్టెన్ అనేది కూడా పక్కనపెట్టి భారత జట్టు అభిమానులు కూడా ఆమె ఫోటోను ప్రశంసించకుండా ఉండలేకపోయారు.
''వావ్... ఎంత శక్తిమంతమైన పోటో ఇది. భారత్, పాక్ మధ్య పోరుకు పసిబిడ్డతో తరలి వచ్చిన కెప్టెన్. ఇటీవలే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది'' అంటూ నెటిజన్లు పాక్ మహిళా జట్టు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ''మైదానంలోకి ఆరునెలల ప్రాయంలోని బిడ్డతో వచ్చిన పాక్ కెప్టెన్ అద్భుతమైన, శక్తివంతమైన సందేశాన్ని ఇస్తోంది. తల్లులెప్పుడూ శక్తిమంతులే కదా..'' అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నెటిజన్ల వ్యాఖ్యలకు మించి పాక్ కెప్టెన్ పసిబిడ్డను భారత మహిళా జట్టు గ్రీట్ చేసిన వైనం క్రికెట్ ఆటను మించి మాతృత్వ ప్రదర్శనకు పట్టం కట్టింది. పాక్ కెప్టెన్ పసిబిడ్డతో మైదానంలోకి రాగానే భారత మహిళా జట్టు సభ్యులు ఆమె చుట్టూ మూగి ఆ బిడ్డను పలకరించడం, స్పర్శించడం వీడియో రూపంలో చూడగానే నెటిజన్లు పరవశించిపోయారు. పాక్ కెప్టెన్ వారితో ముచ్చటించడం. తన బిడ్డగురించిన జ్ఞాపకాలను వారితో పంచుకోవడం చూస్తుంటే ఆ క్షణం తాము ప్రత్యర్థులమనే విషయాన్ని కూడా వారు మర్చిపోయినట్లు ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Pakistan captain @maroof_bismah arriving at the ground earlier today for the #INDvPAK clash with her 6 month old. What a splendid, powerful image. Mothers always hustle! #CWC22 pic.twitter.com/CZnm2G4qO2
— Suprita Das (@MissDasTweets) March 6, 2022
ఇంకా పెళ్లికాని భారత మహిళా జట్టు సభ్యులు పాక్ కెప్టెన్ పసిబిడ్డ చుట్టూ మూగి ఆడుకోవడం నెటిజన్లలో క్రికెట్ ఆటను మించిన మహదానుభూతిని కలిగించింది. పోటీలో గెలిచినా ప్రత్యర్థిని గౌరవించిన మిథాలీ రాజ్ఆ దివారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ టీమ్ 50 ఓవర్లలో 244 పరుగులు చేసింది. అయితే 2017 తర్వాత భారత్, పాక్ మహిళా జట్లమధ్య తొలిసారి జరిగిన ఈ పోటీలో పాకిస్తాన్ జట్టు వందకు పైబడిన పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ పోటీ సందర్భంగా భారత్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పిన మాటలు కూడా నెటిజన్లను కదిలించేవేశాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ని కెప్టెన్లు ఇద్దరూ తమ మధ్య జరుగుతున్న మరొక మ్యాచ్ గానే చూస్తామని మిథాలీ రాజ్ చెప్పింది.
''ఒక జట్టుగా మేం ప్రపంచ కప్ బరిలోకి దిగడమే ఉద్వేగం కలిగిస్తోంది. ఇది రెండు జట్ల మధ్య జరిగే తొలి గేమ్. పాకిస్తాన్‌తో పోటీ పడుతున్న మ్యాచ్‌గా మేం చూడటంలేదు. పూర్తి సన్నద్ధమై వచ్చిన టీమ్‌ని మాత్రమే మేం పరిగణిస్తిున్నాం. ఈ గేమ్ కోసం రెండు జట్లూ సమానంగానే సంసిద్ధమై వచ్చాయి. మా ఉత్తమమైన ఆటనే ప్రదర్సిస్తాం. కానీ ఈ టోర్నమెంటులో మా మధ్య తొలి గేమ్ గెలిచి ముందడుగు వేయాలనుకుంటున్నాం. మా తొలి గేమ్‌ను ఈ కోణంలోనే చూస్తున్నాం'' అంటూ ప్రత్యర్థి జట్టును గౌరవిస్తూ మిథాలీ రాజ్ చెప్పడం నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది.