క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : కెనడాలో జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 8వ రౌండ్‌లో అతను మరో భారత క్రీడాకారుడు విదిత్ గుజరాతిని ఓడించాడు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 38 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. ఈ విజయంతో 5.0 పాయింట్లతో నిలిచిన అతను రష్యా ప్లేయర్ ఇయాన్ నెపోమ్నియాచ్చితో కలిసి టాప్ ర్యాంక్‌ను పంచుకున్నాడు. అలాగే, ఆర్.ప్రజ్ఞానంద టోర్నీలో మరో డ్రా చేసుకున్నాడు. 8వ రౌండ్‌లో అతను అలిరెజా ఫిరౌజ్జా(ఇరాన్)తో కలిసి 40 ఎత్తుల్లో పాయింట్ల పంచుకున్నాడు. ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. విదిత్ 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, ఈ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి తొలి విజయాన్ని అందుకుంది. 8వ రౌండ్‌లో ఆమె సహచర క్రీడాకారిణి ఆర్.వైశాలిపై నెగ్గింది. నల్లపావులతో ఆడిన ఆమెకు వైశాలి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే, 63వ ఎత్తుల్లో ఆమె పైచేయి సాధించింది. మహిళల విభాగంలో కోనేరు హంపి 3.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. వైశాలి 2.5 పాయింట్లతో చివరి స్థానంలో ఉన్నది.