BWF World Junior Championships 2023: క్వార్టర్ ఫైనల్స్‌కు భారత్..

Update: 2023-09-28 16:48 GMT

న్యూఢిల్లీ : అమెరికాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. తాజాగా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో జర్మనీని చిత్తు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్ రెడ్డి-వైష్ణవి జోడీ 21-13, 23-21 తేడాతో డేవిడ్ ఎకెర్లిన్- అమేలీ లెమాన్‌పై గెలిచి శుభారంభం అందించింది. అదే జోరును కొనసాగిస్తూ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21-12, 21-7 తేడాతో లూయిస్ పొంగ్రాట్జ్‌పై ఏకపక్ష విజయం సాధించాడు. ఆ తర్వాత ఉన్నతి హుడా భారత్ విజయాన్ని ఖరారు చేసింది.

ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఉన్నతి 21-12, 21-11 తేడాతో సెలిన్ హజ్బ్‌పై నెగ్గింది. దాంతో భారత్ వరుసగా మూడు గేమ్‌లను దక్కించుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆలస్యంగా పుంజుకున్న జర్మనీ మెన్స్ డబుల్స్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో దివ్యమ్ అరోరా-నికోలస్ రాజ్ జోడీపై 18-21, 21-18, 18-21 తేడాతో డేవిడ్ ఎకెర్లిన్-సిమోన్ క్రాక్స్‌ విజయం సాధించింది. ఇక, ఆఖరి ఉమెన్స్ డబుల్స్‌ మ్యాచ్‌లో వెన్నెల-శ్రియాన్షి జోడీ 21-15, 21-18 తేడాతో అమేలీ లెమాన్-కారా సిబ్రెట్జ్‌పై గెలుపొందడంతో భారత్ 4-1 తేడాతో మ్యాచ్‌ను దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో భారత్.. మలేషియాతో తలపడనుంది.

Similar News