కోహ్లీని చూడాలా? ఆధార్ కార్డు తెచ్చుకోండి
కోహ్లీ మ్యాచ్ ఆడుతుండటంతో స్టేడియం వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.

- నేటి నుంచి ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మ్యాచ్
- ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన డీడీసీఏ
దిశ, స్పోర్స్:
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. తన సొంత జట్టు ఢిల్లీ తరపున గురువారం నుంచి అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్‌తో జరుగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు టికెట్లు అమ్మే సాంప్రదాయం లేనందున.. కోహ్లీ కోసం భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అభిమానులు ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ఒక జిరాక్స్ కాపీని తీసుకొని వస్తే స్టేడియంలోకి ఉచితంగా అనుమతిస్తామని డీడీసీఏ కార్యదర్శి అశోక్ కుమార్ శర్మ తెలిపారు. 10 వేల మంది ప్రేక్షకులకు ఆధార్ కార్డు ద్వారా ఉచిత ఎంట్రీ కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. గేట్ నంబర్ 16. 17 ద్వారా గౌతమ్ గంభీర్ స్టాండ్ లోకి అభిమానులను అనుమతించనున్నారు. అలాగే గేట్ నంబర్ 6 ద్వారా డీడీసీఏ సభ్యులు, అతిథులకు ఎంట్రీ ఉంటుందని తెలిపారు. రంజీ మ్యాచ్ అయినా అన్ని అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌లకు చేసినట్లే ఏర్పాట్లు చేశామని అన్నారు. కాగా, ఈ మ్యాచ్‌ను జియో సినిమా యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కోహ్లీ మ్యాచ్ ఆడుతుండటంతో స్టేడియం వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.
ఇక విరాట్ కోహ్లీ బుధవారం మ్యాచ్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. జట్టులోని జూనియర్లు కిట్ బ్యాగ్ మోస్తామన్నా.. వద్దని వారించాడని సమాచారం. ఢిల్లీ జట్టులో ఉన్న ప్లేయర్స్ అందరిలో కోహ్లీనే ఎక్కువ ఫిట్‌గా ఉన్నాడని, గురువారం నాటి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు విరాట్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ముందుగా ఫుట్‌బాల్ వార్మప్ సెషన్‌లో పాల్గొని.. ఆ తర్వాత నెట్స్‌లో చాలా సేపు చెమటోడ్చాడు.