'టీమ్ ఇండియా ఆటగాళ్ల ఓవరాక్షన్ తట్టుకోలేం'.. అంపైర్ నితిన్ మీనన్ ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్‌లో చివరి మూడు టెస్ట్‌లకు ప్రముఖ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు.

Update: 2023-06-18 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరగతున్న యాషెస్ సిరీస్‌లో చివరి మూడు టెస్ట్‌లకు ప్రముఖ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ  ఇంటర్వ్యూలో టీమ్ ఇండియా ఆటగాళ్లపై నితిన్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆడుతున్నప్పుడు టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు అంపైరింగ్‌ నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా ఒత్తిడి తీసుకొస్తారని అన్నాడు. వారి ఓవరాక్షన్ తట్టుకోవడం చాలా కష్టం ఉంటుందని తెలిపాడు. 'సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్నపుడు భారత జట్టుపై భారీ అంచనాలు ఉంటాయి. మైదానం కూడా అభిమానులతో కిక్కిరిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా స్టార్లు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. పరిస్థితి 50-50గా ఉన్నప్పుడు నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా మాపై ఒత్తిడి పెంచుతారు. అయితే ఈ ఒత్తిడి తట్టుకుని నియంత్రణతో ఉండగలిగితేనే అంపైర్‌గా మా దృష్టి మరలకుండా జాగ్రత్త పడొచ్చు.

అయితే అంపైర్లకు ఇలాంటి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో ముందుగానే శిక్షణ ఇస్తారు. అందుకే వాళ్లేం చేసినా, మా ఫోకస్ దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా మా ఏకాగ్రత దారి తప్పదు. ఇండియాలో ఎన్నో మ్యాచులు ఆడాను. ఐసీసీ ప్యానల్‌లో భారత్‌ తరఫున సేవలందించడం పెద్ద బాధ్యత. ఎక్కువ అనుభవం లేకుండానే ఈ ప్యానల్‌లోకి వచ్చాను. కానీ గత మూడేళ్లుగా అంపైర్‌గా ఎంతో ఎదిగాను. ఎన్నో విషయాల్లో మెరుగయ్యాను. ప్రస్తుతం యాషెస్‌ సిరీస్‌లో బాధ్యతలు చేపట్టా. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు పని చేయాలనేది నా కల. కొవిడ్‌ సమయంలో ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఇప్పడు మళ్లీ ఛాన్స్‌ లభించింది'అని నితిన్‌ మీనన్ పేర్కొన్నాడు.


Similar News