Paris olympics : సెయిన్ నదిలో ఈదిన బెల్జియం అథ్లెట్‌కు అస్వస్థత
పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా సెయిన్ నదిలో మారథాన్ స్విమ్మింగ్, ట్రయాథ్లాన్ ఈవెంట్లను నిర్వహించారు.
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా సెయిన్ నదిలో మారథాన్ స్విమ్మింగ్, ట్రయాథ్లాన్ ఈవెంట్లను నిర్వహించారు. అయితే, ఆ నదిలో ఈదిన పలువురు అథ్లెట్లు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. గత బుధవారం సెయిన్ నదిలో నిర్వహించిన మహిళల ట్రయాథ్లాన్ ఈవెంట్‌లో పాల్గొన్న బెల్జియం అథ్లెట్ క్లైర్ మిచెల్ అనారోగ్యానికి గురైంది. బెల్జియం ఒలింపిక్ కమిటీ క్లైర్ మిచెల్ అస్వస్థతకు గురైనట్టు నిర్దారించింది. దీంతో సోమవారం జరిగిన ట్రయాథ్లాన్ మిక్స్‌డ్ రిలే ఈవెంట్ నుంచి బెల్జియం తప్పుకుంది. క్లైర్ మిచెల్ అస్వస్థతకు గురించి లోతుగా వెళ్లని కమిటీ.. దీని నుంచి భవిష్యత్తు ఒలింపిక్స్ క్రీడల్లో ట్రయాథ్లాన్ పోటీలు నిర్వహించడానికి పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
మరోవైపు, బెల్జియం మీడియాలో ఈ.కోలి బ్యాక్టిరియా వల్ల క్లైర్ మిచెల్ అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. సెయిన్ నదిలో ఈదిన స్విస్ అథ్లెట్ అడ్రియన్ బిఫ్రోడ్ కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే, స్విస్ జట్టు మాత్రం సోమవారం ట్రయాథ్లాన్ మిక్స్‌డ్ రిలే పాల్గొంది. ఒలింపిక్స్ ప్రారంభానికి కంటే ముందు నుంచే సెయిన్ నది నీటి నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు, వర్షాల పడటంతో నదిలో కాలుష్యం పెరిగిపోయింది. పలుమార్లు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేశారు. అయితే, సెయిన్ నీటిని పరీక్షించి, సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే పోటీలు నిర్వహించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.