డీఆర్ఎస్ సిగ్నల్.. ముంబై కోచ్, బ్యాటర్ పై బీసీసీఐ చర్యలు..!

ముంబై కోచ్ కీరన్ పొలార్డ్, బ్యాటర్ టిమ్ డేవిడ్ పై చర్యలు తీసుకుంది బీసీసీఐ. పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా డీఆర్ఎస్ విషయంలో ముంబయి మోసానికి పాల్పడిందని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు తెర లేచింది.

Update: 2024-04-20 10:38 GMT

దిశ, స్పోర్ట్స్: ముంబై కోచ్ కీరన్ పొలార్డ్, బ్యాటర్ టిమ్ డేవిడ్ పై చర్యలు తీసుకుంది బీసీసీఐ. పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా డీఆర్ఎస్ విషయంలో ముంబయి మోసానికి పాల్పడిందని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు తెర లేచింది. దీంతో కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం డేవిడ్, పొలార్డ్ లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈ ఇద్దరికి తమ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించినట్లు పేర్కొంది.

ఏప్రిల్ 17న ముంబై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో.. అర్ష్‌దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో ఐదో బంతిని ముంబై బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆడాడు. అయితే, ఆ బంతి అతడికి దూరంగా వెళ్లింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఎలాంటి సిగ్నల్‌ ఇవ్వలేదు. కానీ, డగౌట్‌లోని ముంబయి బ్యాటర్ టిమ్‌ డేవిడ్‌తోపాటు కోచ్ కీరన్ పొలార్డ్ వైడ్‌ సిగ్నల్ కోసం డీఆర్‌ఎస్‌ అడగాలంటూ సైగలు చేశారు. దీనిని గమనించిన పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ సామ్ కరన్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. అవేవీ పట్టించుకోని ఫీల్డ్‌ అంపైర్‌ డీఆర్ఎస్‌ రిఫర్‌ చేయడం గమనార్హం. దీంతో అంపైరింగ్‌ వ్యవస్థపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ముంబయి జట్టుకు అనుకూలంగా మారుతుందనే ట్రోలింగ్‌ మొదలైంది. దీంతో, ముంబై ప్లేయర్లపై చర్యలు తీసుకుంది బీసీసీఐ.


Similar News