సేన్ అబ్బాట్ ఆల్‌రౌండ్ షో.. విండీస్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో విండీస్‌పై 83 పరుగుల తేడాతో ఆసిస్ విజయం సాధించింది. సేన్ అబ్బాట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే తొలి వన్డే నెగ్గిన కంగారుల జట్టు వరుసగా మరో మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది. దీంతో చివరి వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ఆ జట్టు వశమైంది. ఇక, ఈ నెల 6న జరిగే ఆఖరి మ్యాచ్ నామమాత్రమే కానుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 258 పరుగులు చేసింది. కీలక ప్లేయర్లు నిరాశపర్చిన వేళ అబ్బాట్(69) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మాథ్యూ షార్ట్(41), గ్రీన్(33) కీలక పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో మోటీ 3 వికెట్లు, రొమారియో షెఫర్డ్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లతో రాణించారు. అనంతరం ఆసిస్ బౌలర్లు మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఛేదనకు దిగిన విండీస్‌ను 175 పరుగులకే ఆలౌట్ చేశారు. ఏమాత్రం పోరాట పటిమ కనబర్చన కరేబియన్ జట్టు 43.3 ఓవర్లలోనే కుప్పకూలింది. కీసీ కార్టీ(40) టాప్ స్కోరర్. ఇక, మిగతా బ్యాటర్లందరూ తేలిపోయారు. బ్యాటుతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సేన్ అబ్బాట్ బంతితోనూ మెరిసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. అతనితోపాటు జోష్ హాజెల్‌వుడ్ మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. సదర్లాండ్ 2 వికెట్లతో రాణించాడు. వన్డే సిరీస్‌కు ముందు రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.