దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆసీస్ బ్యాటర్లు చక్కగా బ్యాటింగ్ చేశారు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (32)ను అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి జడేజా కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మహమ్మద్ షమీ బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలో ఉస్మాన్ ఖవాజా (104 నాటౌట్)తో జత కలిసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. లంచ్ తర్వాత టీ వరకు వీళ్లిద్దరూ చక్కగా ఆడారు.
స్మిత్ క్లీన్ బౌల్డ్..
టీ నుంచి తిరిగొచ్చిన కాసేపటికే జడేజా వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన స్మిత్ విఫలమయ్యాడు. ఈ సమయంలో ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. కానీ టీ ముగిసిన వెంటనే అతను పెవిలియన్ చేరడంతో ఆసీస్ జట్టు కొంచెం తడబడినట్లే కనిపించింది. ఆ తర్వాత వచ్చిన పీటర్స్ హాండ్స్‌కోంబ్ (17) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
సెంచరీతో చెలరేగిన ఖవాజా..
ఖవాజా తో కలిసి జట్టును ఆదుకునేలా కనిపించిన అతన్ని కూడా షమీ అవుట్ చేశాడు. షమీ వేసిన అద్భుతమైన డెలివరీని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించిన హాండ్స్ కోంబ్ విఫలమయ్యాడు. అతని బ్యాట్‌ను మిస్సయిన బంతి ఆఫ్‌స్టంప్‌ను కూల్చింది. అనంతరం ఖవాజా కు కామెరూన్ గ్రీన్ (49 నాటౌట్) జత కలిశాడు. వీళ్లిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే వేగంగా ఆడారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 255 పరుగులతో నిలిచింది. భారత బౌలర్లలో షమీ 2 వికెట్లు తీసుకోగా.. అశ్విన్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.