Asian Games 2023: మలేషియాపై బంగ్లాదేశ్‌ విజయం.. సెమీస్‌లో టీమిండియాతో 'ఢీ'

Asian Games 2023 మెన్స్‌ క్రికెట్‌ క్వార్టర్‌ ఫైనల్‌-4లో పసికూన మలేషియా.. బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించింది.

Update: 2023-10-04 10:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: Asian Games 2023 మెన్స్‌ క్రికెట్‌ క్వార్టర్‌ ఫైనల్‌-4లో పసికూన మలేషియా.. బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించింది. అఫీఫ్‌ హొస్సేన్‌ ఆల్‌రౌండ్‌ షోతో (14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు, 3 వికెట్లు) ఆదుకోకపోయి ఉంటే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేది. అఫీఫ్‌ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో గట్టెక్కిన బంగ్లాదేశ్‌, అక్టోబర్‌ 6న జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన టీమిండియాను ఎదుర్కొంటుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. మలేషియా బౌలర్‌లో.. పవన్‌దీప్‌ సింగ్‌ (2), విరన్‌దీప్‌ సింగ్‌ (4-0-13-0) బంగ్లా బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. విజయ్‌ ఉన్ని, అన్వర్‌ రెహ్మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సైఫ్‌ హస్సన్‌ (50 నాటౌట్‌), అఫీఫ్‌ హొస్సేన్‌ (23), షాదత్‌ హొస్సేన్‌ (21) మాత్రమే రాణించారు. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేషియా 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరన్‌దీప్‌ సింగ్‌ (39 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి ఓవర్‌ వరకు క్రీజ్‌లో నిలబడి మలేషియాను గెలిపించినంత పని చేశాడు. అయితే ఆఖరి ఓవర్లో అఫీఫ్‌ హొస్సేన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మలేషియా గెలుపుకు కావాల్సిన 5 పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. దీనికి ముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ 3లో ఆఫ్ఘనిస్తాన్‌.. శ్రీలంకు షాకిచ్చి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌.. పాక్‌ను ఢీకొంటుంది.


Similar News