Ashes 5th Test Day 4: డేవిడ్‌ వార్నర్‌ వరల్డ్ రికార్డు..

యాషెస్‌ సిరీస్‌ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌ నాలుగో రోజు ఆటలో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Update: 2023-07-30 16:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌ నాలుగో రోజు ఆటలో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు (25) 100 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగో రోజు ఆటలో ఉస్మాన్‌ ఖ్వాజాతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో వార్నర్‌ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అతను జాక్‌ హబ్స్‌, గ్రేమ్‌ స్మిత్‌, అలిస్టర్‌ కుక్‌ (24)ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు.

ఈ జాబితాలో మైఖేల్‌ ఆథర్టన్‌ (23), వీరేంద్ర సెహ్వాగ్‌ (23) మూడో స్థానంలో ఉన్నారు. యాషెస్‌ ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. 38 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 135 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌కు నిలిపి వేశారు. ఆసీస్‌ గెలుపుకు ఇంకా 249 పరుగుల దూరంలో ఉంది. డేవిడ్‌ వార్నర్‌ (58), ఉస్మాన్‌ ఖ్వాజా (69) క్రీజ్‌లో ఉన్నారు.

యాషెస్‌లో 2017-18 సిరీస్‌ తర్వాత తొలిసారి శతక భాగస్వామ్యం నమోదైంది. ఆ సీజన్‌లో ఆసీస్‌ ఓపెనింగ్‌ పెయిర్‌ వార్నర్‌-కెమరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ తొలి వికెట్‌కు 122 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేయగా.. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్‌-ఖ్వాజా జోడీ అజేయమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. యాషెస్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో వార్నర్‌ నాలుగో స్థానానికి ఎగబాకాడు. యాషెస్‌లో వార్నర్‌ ఇప్పటివరకు 8 సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌లో భాగమయ్యాడు. ఈ రికార్డుకు సంబంధించిన జాబితాలో జాక్‌ హబ్స్‌ (16) టాప్‌లో ఉండగా.. హెర్బర్ట్‌ సట్చ్‌క్లిఫ్‌ (15), మార్క్‌ టేలర్‌ (10) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

యాషెస్‌ ఐదో టెస్ట్‌ స్కోర్‌ వివరాలు (వర్షం అంతరాయం కలిగించే సమయానికి)

ఇంగ్లండ్‌: 283 & 395

ఆసీస్‌: 295 & 135/0


Similar News