మెరిసిన జ్యోతి.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో తెలుగమ్మాయికి స్వర్ణం, రజతం
భారత స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ అదరగొట్టింది.
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ అదరగొట్టింది. సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2 టోర్నీలో స్వర్ణం, రజతం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో జ్యోతి జట్టు 232-226 తేడాతో తుర్కియేకు చెందిన హజల్ బురున్, ఐసే బెరా సుజెర్, బేగం యువా టీమ్‌ను ఓడించింది. గత నెలలో జరిగిన స్టేజ్-1 టోర్నీలో ఈ త్రయం స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే.
మరోవైపు, కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ప్రియాన్షుతో కలిసి జ్యోతి రజత పతకంతో సరిపెట్టింది. ఫైనల్‌లో జ్యోతి జోడీ 153-155 తేడాతో ఒలివియా డీన్-సాయర్ సులివన్(అమెరికా) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్ నెగ్గిన జ్యోతి, ప్రియాన్షు.. మిగతా మూడు రౌండ్లలో వెనకబడి రెండో స్థానంలో నిలిచింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఈవెంట్‌లో జ్యోతి టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయింది. క్వార్టర్ ఫైనల్‌లోనే పరాజయం పాలైంది. గత నెలలో జరిగిన స్టేజ్-1 టోర్నీలో ఆమె విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక, కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లో ప్రథమేశ్ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో అతను 148(9)-148(10) తేడాతో మైక్ ష్లోసెర్(నెదర్లాండ్స్) చేతిలో షూటౌట్‌లో పరాజయం పాలయ్యాడు.