దివికేగిన కారణజన్ముడు
దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం అస్తమించారు. బాలు గానామృతం ఇక కానరాదు వినరాదు. గానమే శ్వాసగా జీవించిన ఆ జీవం గానాన్ని ఒంటరి చేసి వెళ్లిపోయింది. పాటకు ప్రాణం పోసిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. గానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఆ ప్రతిరూపం కనుమరుగైంది. భాషా భేదం లేకుండా నిరంతరం నిర్విరామంగా కళకు అంకితమైన ఆ గాన సాగరం కనీవిని ఎరుగని రీతిలో అభిమాన సాగరాన్ని సంపాదించుకుని సెలవు తీసుకుంది. వేల పాటలతో ‘పాడుతా […]
దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం అస్తమించారు. బాలు గానామృతం ఇక కానరాదు వినరాదు. గానమే శ్వాసగా జీవించిన ఆ జీవం గానాన్ని ఒంటరి చేసి వెళ్లిపోయింది. పాటకు ప్రాణం పోసిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. గానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఆ ప్రతిరూపం కనుమరుగైంది. భాషా భేదం లేకుండా నిరంతరం నిర్విరామంగా కళకు అంకితమైన ఆ గాన సాగరం కనీవిని ఎరుగని రీతిలో అభిమాన సాగరాన్ని సంపాదించుకుని సెలవు తీసుకుంది. వేల పాటలతో ‘పాడుతా తీయగా’ అంటూ ప్రతీ వారం పలకరించే ఆ గాన మాధుర్యం ఇక పలకరించే సమయం లేదని వెళ్లిపోయినా..ఒక్కసారి ఒకే ఒక్కసారి మాకోసం ఒక్క పాట పాడిపోవా అంటూ కన్నీటి అభ్యర్థనలు చేస్తున్నారు అభిమానులు. ఈ క్షణం దేవుడిని ఎదిరించే శక్తి ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కారణజన్ములు. భువి మీదకు ఎందుకు వచ్చారో..ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని మరి వెళ్లారు ఆ మహానుభావుడు. నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో 1946 జూన్ 4న జన్మించిన బాలు..హరికథ కళాకారుడైన తన తండ్రి ఎస్పీ సాంబమూర్తిలోని సంగీత జ్ఞానాన్ని వారసత్వంగా పుచ్చుకున్నారు. తండ్రితో కలిసి నాటకాలు కూడా వేశారు. చిన్ననాటి నుంచే నాటకం, రాగంతో ప్రేక్షకులను మైమరపించిన బాలు సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి సలహాతో అనంతపూర్‌లోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన తను టైఫాయిడ్ కారణంగా ఇంజినీరింగ్‌కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఈ సమయంలోనే మద్రాస్ బేస్డ్ తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ పోటీలు నిర్వహించగా ఫస్ట్ ప్రైజ్ సంపాదించాడు. ఆ తర్వాత ఇళయరాజా, అనిరుత్తా, గంగై అమరన్‌తో కలిసి మ్యూజిక్ ట్రూప్ కూడా స్థాపించాడు బాలు. ఎస్పీ కోదండపాణి, ఘంటసాల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సింగింగ్ కాంపిటీషన్‌లో పాల్గొన్న బాలు బెస్ట్ సింగర్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో బాలు పాటలో కొత్తదనం, ఆ రాగంలో తియ్యదనానికి ఫిదా అయిన కోదండపాణి గురువుగా మారిపోయారు. ఎస్పీబీకి సినిమా పాటలు పాడే అవకాశాలు ఇప్పించారు.
బాలు పుట్టుకలోనే సంగీతం..
శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం లేకపోయినా సరే..తనకు దేవుడిచ్చిన వరమా లేక మరేదైనా తెలియదు. కానీ, ఒక్కసారి పాట వింటే అదే శృతి, లయతో పాట పాడి వినిపించగల ఏకసంతాగ్రహి బాలు.. సినీ కళామతల్లికి దశాబ్దాల పాటు ‘స్వరాభిషేకం’ చేశాడు. అప్పటికే ఘంటసాల పాటలను సినీ అభిమానులు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నా బాలు మాధుర్యం కొత్తగా అనిపించింది సంగీత దర్శకులకు, సంగీత అభిమానులకు. అందుకే అవకాశాలు వెల్లువెత్తాయి. 1970 ద్వితీయార్థం నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎస్పీబీ తీరిక లేకుండా సంగీత సరస్వతి సేవకే అంకితం అయ్యాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో సంగీతంలో కొత్త విషయాలను గుర్తిస్తూ, తప్పు ఒప్పులు సరిదిద్దుకుంటూ గాన గంధర్వుడిగా ఎదిగాడు. శాస్త్రీయం, జానపదం, లలిత సంగీతం, రాక్ బ్రేక్ అనే తేడాలేకుండా తన గొంతులో అన్ని వైవిధ్యాలు పలికించాడు. ఆబాలగోపాలాన్ని మురిపించాడు. గురువు ఎస్పీ కోదండపాణి సంగీత సారథ్యంలో 1966లో ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో తొలి పాట పాడిన బాలు..ఆ తర్వాత వెంటనే కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అవకాశాలు అందుకున్నారు. పి. సుశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, వాణి జయరాంతో బాలు డ్యూయెట్ సాంగ్స్‌కు చాలా క్రేజ్ ఉండేది.
హీరోలకు అనుగుణంగా పాట..
ఒక్కో హీరోకి ఒక్కో రకంగా పాడటం బాలు ప్రత్యేకత. హీరోల వాయిస్ మిమిక్రీ చేస్తూ పాటలు పాడిన బాలు తీరిక లేకుండా పని చేశాడు. పాటలో పరవశించాడు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మైనే ప్యార్ కియా సినిమాలో దిల్ దీవానా సాంగ్ పాడి హిట్ ఇచ్చిన బాలు దశాబ్దం పాటు సల్మాన్ పాటలను తనే పాడాడు. సల్మాన్‌ఖాన్ వాయిస్ అయిపోయాడు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్, జెమినీ గణేషన్ లాంటి వారికి కూడా పాటలు పాడిన తను 1990లో తెలుగులో చిరు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వాయిస్‌తో పాట పాడారు. 1981లో ఒక్క రోజే ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే కేవలం 12 గంటల్లో 17 పాటలు పాడిన ఘనత బాలుదే. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఒక్క రోజు 19 పాటలు పాడి తనదైన ముద్రవేసిన ఎస్పీబీ..సంగీత దర్శకులు ఆనంద్ – మిళింద్ సమక్షంలో హిందీలో ఒకే రోజు 16 పాటలు పాడారు. పాట కోసం అంతగా పరితపించిన బాలు..తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో 40 వేలకుపైగా పాటలు పాడి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
ఒక్కరోజులో 21 పాటలు..
పాట కోసమే పుట్టాడు..పాటతోనే బతికాడు..చివరి రోజుల్లో కూడా బెడ్ పై పేషెంట్‌లా లేవలేని స్థితిలో ఉన్నా..పాట కోసమే పరితపించాడు..పాట పాడేందుకు ప్రయత్నించాడు. గానం తనతో స్నేహం చేయగా రాష్ట్రం, దేశం, ప్రపంచం తనకు సలాం చేసింది. ఆ అమృతధారకు అభివందనం చేస్తూ రికార్డులు, రివార్డులు, అవార్డులు దాసోహం అయ్యాయి. ఆ మహానుభావుడి పాదాల చెంత నిలిచి జన్మధన్యం చేసుకున్నాయి. 40 వేల పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించిన ఆయన గాన చరిత గురించి ఏం చెప్పగలం? ఏ పాటను ఎన్నుకుని ఇది మాత్రమే బాగుందని పొగడగలం..ఆయన గొంతు శృతి చేయగా లయగా మారి సంగీతాభిమనుల మనసును ఆహ్లాదపరిచిన ప్రతీ పాట ఆణిముత్యమే. ప్రతీ రాగం అద్వితీయమే. ఒక్కరోజులో 21 పాటలు పాడిన ఘనత బాలు గారిదే.
సంగీతానికి కొత్తరుచులు..
‘రావమ్మా… మహాలక్ష్మి రావమ్మా.. ‘ పాట ఎస్పీబీని గ్రామీణ ప్రజలకు కూడా దగ్గర చేయగా, ‘కన్నెవయసు’లోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో… ‘, ‘సుఖదుఃఖాలు’లోని ‘మేడంటే మేడా కాదూ… ‘ లాంటి పాటలు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. పౌరాణిక ప్రత్యేకతలు గలిగిన ‘ఏకవీర’, ‘చెల్లెలి కాపురం’ చిత్రాల్లోని పాటలు కూడా వాటికవే ప్రత్యేకం. ‘సిరిమల్లె నీవె..’, ‘మావి చిగురు తినగానే.. ‘, ‘మధుమాస వేళలో…’, ‘శివరంజని నవరాగిణి..’ లాంటి బాలు పాటలు ప్రజలకు కొత్త రుచులు చూపించాయి.
అలరించిన సంగీత త్రయం
ముఖ్యంగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎస్.జానకి, బాలు పాడిన పాటలు ప్రజలను అలరించాయి. 1970 -80 వరకు ఈ సంగీత త్రయం సంగీత సాగరంలో మైమరపించింది. 1980లో శంకరాభరణం సినిమా ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన బాలు.. కె.వి మహదేవన్ సంగీతంలో తను పాడిన పాటలకు బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1981లో హింది సినిమా ఏక్ దూజే కె లియె ద్వారా నేషనల్ అవార్డు అందుకున్నారు. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతి ముత్యం, రుద్రవీణ సినిమాలకు సైతం నేషనల్ అవార్డ్ దక్కించుకున్నారు. ‘సాగరసంగమం’లోని ‘వే వేల గొపెమ్మలా..’, ‘వేదం అణువణువున నాదం…’, ‘తకిట తధిమి తకిట తధిమి తందానా.. ‘ లాంటి పాటలతో బాలు మరింత ప్రాచుర్యం పొందారు.
ఘంటసాలతో బాలు గానం
ఘంటసాల, ఎస్పీ బాలు కలిసి దాదాపు ఐదారేండ్లపాటు ఏక కాలంలో పరిశ్రమలోనే ఉన్నారు. కానీ, వీరిద్దరూ కలిసి పాడిన పాటలు మాత్రం చాలా తక్కువ. ‘ఏకవీర’లోని ‘ప్రతీ రాత్రి వసంత రాత్రి…’, ‘మంచిమిత్రులు’లోని ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ‘, లాంటివి కొన్ని. కొత్త తరం నటులు సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత వారితో బాలుకు, బాలు పాటల వల్ల వారికి గుర్తింపు లభించింది. ఘంటసాల, ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ తరహాలోనే ఎస్పీ బాలు, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ వర్కవుట్ అయింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
బాలు బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం గాయకుడిగా అవార్డులు, రివార్డులు పొందడం మాత్రమే కాదు ఊపిరి సలపనంతగా ఉన్న సాంగ్స్ రికార్డింగ్ షెడ్యూల్‌లోనూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా రాణించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన కమల్‌హాసన్ కథానాయకుడిగా వచ్చిన ‘శుభసంకల్పం’ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు బాలు. 1984లో వచ్చిన మయూరి చిత్రం తమిళ్‌లోకి డబ్బింగ్ కాగా, ఆ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. చిరు, వెంకీ, నాగార్జున లాంటి హీరోలకు తండ్రిగా నటించిన బాలు..బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘సిస్టర్ నందిని’ చిత్రంలో కథానాయకుడిగా కనిపించారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ చిత్రంలో నట విశ్వరూపాన్ని చూపారు బాలు. శేషజీవితంలో వృద్ధదంపతుల జీవనం, సాన్నిహిత్యం ఎలా ఉంటుందో కెమెరా ముందు జీవించి చూపించాడు. ‘కేలడి కణ్మణి’, ‘గుణ’ లాంటి చిత్రాల్లోనూ ఆయన విలక్షణ పాత్రలతో మెప్పించారు.
పాడుతా తీయగా..
బాలు లేనిదే పాడుతా తీయగా లేదు. తీయగా పాడుతాడు..పాడిస్తాడు. సున్నితంగా దోషాలను సవరిస్తాడు..మహానుభావులను కీర్తిస్తాడు. సంగీత సామ్రాజ్యంలోకి కొత్త తరాన్ని ఆహ్వానించే క్రమంలో సాగిన ‘పాడుతా తీయగా’కు 198 ఎపిసోడ్‌లు వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా సేవలందించారు. ‘స్వరాభిషేకం’ కార్యక్రమం ద్వారా ఇతర గాయకులతో కలిసి సంగీతాభిషేకం చేసిన బాలు..‘ఎందరో మహానుభావులు’, ‘పాడాలని ఉంది’,‘ఝుమ్మంది నాదం’ అంటూ సంగీత ఇతివృత్త కార్యక్రమాలకు మద్దతు ఇచ్చాడు. అదే సంగీత లోకంలో ఆనందాన్ని పొందాడు. కన్నడ ఈటీవీలోనే ‘యెధే తుంబి హాడువేణు’ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆయన..శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ సమర్పించిన ‘సునాద వినోదిని’ కార్యక్రమానికి కూడా తన సేవలందించారు. ప్రభుదేవా, వెంకటేష్ లాంటి వారితో డ్యాన్స్ స్టెప్స్ వేసి..కాదేది బాలుకు అసాధ్యం అని నిరూపించారు.