నియంత్రిత సాగా.. నియంతృత్వ సాగా..
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ తీరు పట్ల రైతాంగం అసంతృప్తి జ్వాలలు వెళ్లగక్కుతోంది. అసలే ఈ యేడు రైతాంగాన్ని భారీ వర్షాలు నిండా ముంచాయి. దీనికితోడు పాలకుల నిర్లక్ష్యం వారిని మరింతగా కుంగదీస్తోంది. భారీ వర్షాలకు పంటలు నష్టపోయి.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతులు పుట్టెడు దుఖంలో ఉన్నారు. ఆదుకోవాల్సిన పాలకులు కనీసం పలకరించట్లేదు. రాష్ట్రానికి పెద్ద దిక్కు అని చెప్పుకునే సీఎం కేసీఆర్ మాటలు నమ్మిన రైతాంగం.. పెద్ద సారు చెప్పారని […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ తీరు పట్ల రైతాంగం అసంతృప్తి జ్వాలలు వెళ్లగక్కుతోంది. అసలే ఈ యేడు రైతాంగాన్ని భారీ వర్షాలు నిండా ముంచాయి. దీనికితోడు పాలకుల నిర్లక్ష్యం వారిని మరింతగా కుంగదీస్తోంది. భారీ వర్షాలకు పంటలు నష్టపోయి.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతులు పుట్టెడు దుఖంలో ఉన్నారు. ఆదుకోవాల్సిన పాలకులు కనీసం పలకరించట్లేదు. రాష్ట్రానికి పెద్ద దిక్కు అని చెప్పుకునే సీఎం కేసీఆర్ మాటలు నమ్మిన రైతాంగం.. పెద్ద సారు చెప్పారని నియంత్రిత పంటలను సాగు చేశారు.
సీఎం కేసీఆర్ చెప్పిన పంటల సాగుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సి ఉన్నా.. ఆయన చెప్పారనే ఒక్క కారణంతో చాలామంది రైతాంగం నియంత్రిత పంటలను సాగు చేశారు. నియంత్రిత పంటలను సాగు చేయాలని చెప్పడంలో ఉన్న చిత్తశుద్ధి.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వానికి లేకపోవడం దారుణమనే చెప్పాలి.
వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వస్తువు ధర అయినా పెరుగుతోంది. కానీ ఒక్క రైతు పండించే ఉత్పత్తుల ధరలు మాత్రం నేలను తాకుతున్నాయి. దొడ్డు రకం ధరల కంటే.. సన్న రకం వడ్లకు ఎటూ లేదన్న క్వింటాల్‌కు రూ.200కు పైగానే తేడా ఉంటుంది. గతంలో దొడ్డు రకం వరి ధాన్యానికి రూ.1600 నుంచి రూ.1800 వరకు పలికింది. ఈసారి ప్రభుత్వం దొడ్డు రకం ధాన్యానికి రూ.1888 మద్దతు ధరను ప్రకటించింది. అదే విధంగా సన్నరకానికి గతేడాది క్వింటాల్‌కు రూ.2వేలకు పైగానే పలికింది. కానీ ఈ యేడు మాత్రం రూ.1300 నుంచి రూ.1700కే పరిమితమయ్యింది. నిజానికి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ప్రభుత్వం చెప్పడంతో అన్నదాతలంతా అధిక దిగుబడులు వచ్చే దొడ్డు రకాన్ని వదిలి.. తక్కువ దిగుబడితో పాటు ఖర్చు ఎక్కువ వచ్చే సన్నరకాలను సాగు చేశారు. తీరా ధాన్యం చేతికొచ్చాక సన్నాలకు మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది.
ఇదిలావుంటే.. బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యానికి క్వింటాల్‌కు రూ.5వేలకు పైనే పలుకుతోంది. మరీ అలాంటప్పుడు సన్నరకం వడ్లకు అందులో సగం ధర అంటే రూ.2500 కల్పించే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపడం లేదు. దీని వెనుక కొంతమంది మిల్లర్ల హస్తం ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ఎందుకంటే.. సన్నాలను విపరీతంగా పండించడం వల్ల మార్కెట్‌లో రూ.లక్షలు కూడబెట్టుకునే అవకాశం మిల్లర్లకు లేకుండా పోతోంది. ‘రూ.కోట్లు ఖర్చు పెట్టి మిల్లులను స్థాపించి.. అవసరమైనప్పుడుల్లా పార్టీలను, ప్రభుత్వాలను పోషిస్తూ వస్తున్నాం.
ఇప్పుడు మాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే ధాన్యం విషయంలో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కొంతమంది మిల్లర్లు నిలదీసినట్టు తెలుస్తోంది.’ ఏదీ ఏమైనా ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రిత పంటల సాగు కాస్త.. నియంతృత్వ సాగుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.