తిరుమల బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో తెలుసా?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జనప్రవాహం, తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామస్మరణ
ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి తలెత్తినప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాలను రద్దు చేయడం తిరుమల క్షేత్ర చరిత్రలో లేదు. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అపురూప కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల ఆస్థాన మండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళా మందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జనప్రవాహం, తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామస్మరణ, మాడ వీధులలో దేవేరులతో స్వామి ఊరేగింపులూ, సాటిలేని వైభవంతో సాగే వాహన సేవలు మన కళ్లముందు కదులుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని వివిధ రూపాలలో, అవతారంలో దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కార్యాలు జరగడంతో పాటు పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
ఈ బ్రహ్మోత్సవాలు వందల యేళ్ల నుంచి జరుగుతున్నాయి.ఒకప్పుడు నెలకు ఒకసారి జరిగేవట. కాలక్రమేణా ఏడాదికి ఒకసారి, అధికమాసంలో రెండు సార్లకు పరిమితమయ్యాయి. ఈ వేడుకలలో శ్రీ వేంకటేశ్వరుడు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తకోటికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు వార్షిక (సాలకట్ల) బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా భక్తులు లేకుండా నిర్వహించిన ఉత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించనున్నారు.
ఉత్సవాలు జరిగే తీరు
ఈ ఉత్సవాలు సోమవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. వైఖాసన ఆగమనంలోని క్రతువులలో అంకురార్పణతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్ళి, అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, ఆ మట్టిలో నవధాన్యాలను నాటుతారు. ఉత్సవాలలో మొదటి రోజు మంగళవారం (సెప్టెంబర్ 27) సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంపై ఊరేగింపు ఉంటుంది. రెండో రోజు బుధవారం (సెప్టెంబర్ 28) ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై విహరిస్తారు. మూడో రోజు గురువారం (సెప్టెంబర్ 29) ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సింహవాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. నాలుగో రోజు శుక్రవారం (సెప్టెంబర్ 30) ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు. ఐదో రోజు శనివారం (అక్టోబర్ 1) ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనంపై భక్తులకు కనిపిస్తారు.
ఆరో రోజు ఆదివారం (అక్టోబర్ 2) ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం (స్వర్ణరథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ఏడో రోజు సోమవారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై కనిపిస్తారు. ఎనిమిదో రోజు మంగళవారం (అక్టోబర్ 4) ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై విహరిస్తారు. ఇక తొమ్మిదో రోజు బుధవారం (అక్టోబర్ 5) ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి తలెత్తినప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాలను రద్దు చేయడం తిరుమల క్షేత్ర చరిత్రలో లేదు. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అపురూప కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల ఆస్థాన మండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళా మందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : వెంకటేశ్వర స్వామి ఆస్తుల కార్టూన్ 26-09-2022
రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494