ఏడాదైనా ఏం చేయలేకపోయాం: సోనియా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి ఏడాది గడిచినప్పటికీ వైరస్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోయామని, అందుకు సంబంధించిన వ్యవస్థలు, సదుపాయాలను సిద్ధపరచలేకపోయామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఏడాది కాలం చేతిలో ఉన్నా సెకండ్ వేవ్‌ను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని విమర్శించారు. ఇప్పటికీ కరోనా కేసులు పెరుగుతుంటుంటే గతేడాది లాగే ఆందోళనకు గురికావాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. సమస్యకు తాత్కాలిక ఉపశమనాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టడమే ఈ తీవ్రతకు కారణమని ఆరోపించారు. సోనియా గాంధీ […]

Update: 2021-04-17 06:31 GMT

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి ఏడాది గడిచినప్పటికీ వైరస్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోయామని, అందుకు సంబంధించిన వ్యవస్థలు, సదుపాయాలను సిద్ధపరచలేకపోయామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఏడాది కాలం చేతిలో ఉన్నా సెకండ్ వేవ్‌ను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని విమర్శించారు. ఇప్పటికీ కరోనా కేసులు పెరుగుతుంటుంటే గతేడాది లాగే ఆందోళనకు గురికావాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. సమస్యకు తాత్కాలిక ఉపశమనాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టడమే ఈ తీవ్రతకు కారణమని ఆరోపించారు.

సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆన్‌లైన్‌లో సమావేశమైంది. కరోనా మహమ్మారిపై పోరును రాజకీయాలకు అతీతమైనదిగా కాంగ్రెస్ తొలి నుంచి భావిస్తున్నదని, దేశమంతా కలిసి పోరు చేయాల్సిన యుద్ధమని విశ్వసిస్తున్నదని ఈ భేటీలో సోనియా గాంధీ అన్నారు. కానీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని విమర్శించారు. కరోనా చికిత్స విషయంలోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా, ఇతర రాష్ట్రాల సవాళ్లపై మౌనాన్ని ఆశ్రయిస్తున్నదని ఆరోపించారు.

కరోనాపై పోరుకు ప్రతిపక్షాలు ఇచ్చే నిర్మాణాత్మక సూచనలను పెడచెవినపెట్టడం, ‘నీవా నేనా’ అని పిల్లల వాదులాటగా కేంద్రం వ్యవహరించడం అభ్యంతరకరమని సోనియా గాంధీ అన్నారు. కరోనాను ఎదుర్కొనే ఆయుధాల్లో టీకా ఒకటని, ఆ టీకా తీసుకోవడానికి అర్హత వయసును 45 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని సూచించారు. అంతేకాదు, ఆస్థమా, డయాబెటిస్, కిడ్నీ, కాలేయా సంబంధ, ఇతర క్లిష్టమైన ఆరోగ్య సమస్యలున్న 25 ఏళ్ల లోపు యువతకూ టీకా వేయాలని తెలిపారు. తమ సీఎంలతో చర్చించేటప్పుడు జీఎస్టీ అడ్డంకి విషయం ప్రస్తావనకు వచ్చిందని, రెమ్‌డెసివిర్, మెడికల్ ఆక్సిజన్ సహా ఇతర ప్రాథమిక మెడికల్ అవసరాలు, పరికరాలపైనా 12శాతం జీఎస్టీ విధించడం ఈ సందర్భంలో ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తు్న్న తరుణంలో ఇప్పటికే ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్న పేదలు మరింత చితికిపోయే ప్రమాదముందని, కాబట్టి అర్హులైన పౌరులకు నెలకు రూ. 6000లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. ఈ కరోనా సవాల్‌‌ను రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా భారతీయులుగా ఎదుర్కోవడమే నిజమైన రాజధర్మమని అన్నారు.

Tags:    

Similar News