బియ్యమో.. రామచంద్రా?
దిశ, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఆకలితో బాధపడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం పంపిణీతోపాటు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. రేషన్ కార్డులున్న లబ్ధిదారులకు రూ.1500, వలస కార్మికులకు రూ.500తో పాటు 12 కేజీల బియ్యం పంపిణీ చేశారు. కానీ, కొంతమందికి మాత్రం ఆ సాయం అందడంలేదు. వీళ్లంతా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని గత రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1,08,849 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. […]
దిశ, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఆకలితో బాధపడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం పంపిణీతోపాటు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. రేషన్ కార్డులున్న లబ్ధిదారులకు రూ.1500, వలస కార్మికులకు రూ.500తో పాటు 12 కేజీల బియ్యం పంపిణీ చేశారు. కానీ, కొంతమందికి మాత్రం ఆ సాయం అందడంలేదు. వీళ్లంతా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని గత రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1,08,849 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. వీరందరూ కూడా ప్రభుత్వం ఇప్పుడు అందించే సహాయానికి దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోనే అర్హులైన తమకు అన్యాయం జరిగిందని ఆ దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదల వివరాలు సేకరించి అందించాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ, అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు.
దిక్కుతోచని స్థితిలో దరఖాస్తుదారులు…
రంగారెడ్డి జిల్లాలో 1,08,849 కుటుంబాలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 57,417 కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం, 51,432 కుటుంబాలు అడ్రస్, పేర్ల తప్పు ఒప్పులను సరిచేయడానికి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, కొత్త రేషన్ కార్డులతోపాటు చేర్పులు మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న కార్డులను హోల్డ్‌లో పెట్టడంతో ఆ కుటుంబాలు రేషన్ సరుకులు పొందలేక పోతున్నాయి. ఇలా దరఖాస్తు చేసుకున్నవారిలో సగానికిపైగా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి. ఒకవైపు చేయడానికి పని దొరకక… మరోవైపు ప్రభుత్వ సాయం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ప్రజాప్రతినిధులు సైతం వారికే…
గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీలో ప్రజాప్రతినిధులు రేషన్ కార్డు ఆధారంగానే పంపిణీ చేస్తున్నారు. దీంతో రేషన్ కార్డులు లేని పేదలకు అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. ప్రతి రోజూ పని చేసుకుంటే గానీ పూటగడవని నిరుపేదలు ఎందరో ఉన్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో సహాయం అందుకోవడం లేదు. జిల్లాలో 5,24,887 రేషన్ కార్డులున్న లబ్ధిదారులకు 21,260 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీతోపాటు ప్రతి రేషన్ కార్డుకు రూ.1500 చొప్పున నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు.
వలస కూలీలకు పంపిణీ…
జిల్లాలో పరిశ్రమలు అత్యధికంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల కార్మికులు పని కోసం వలస వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పనులు నిలిచిపోవడంతో వారు ఆకలితో అవస్థలు పడొద్దని రేషన్ సరుకులు పంపిణీ చేశారు. జిల్లాలో 67 వేల మంది వలస కార్మికులున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు 37,894 మంది వలస కార్మికులకు రూ.500 నగదుతో పాటు 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. వీరంతా బీహార్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు. ఈ విధంగానైనా సాయం అందించి తమ ఆకలి తీర్చాలని రేషన్ దరఖాస్తు దారులు ప్రభుత్వాని కోరుతున్నారు.
tags:Rangareddy, ration application, ration rice, cash, government