గ్రామాల్లో సెటిల్మెంట్.. ఇవే దారులు!

ఇంట్లో కూర్చుని తింటే ఎంత పెద్ద కొండలైనా కరిగిపోవాల్సిందే. ఇప్పుడు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. గత నాలుగు నెలలుగా చాలా మంది యువత చేస్తున్న పని అదే. ఏ పనీ లేకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చుని తింటున్నారు. మొదట్లో లాక్‌డౌన్ కాబట్టి, ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు అన్‌లాక్ ప్రారంభమయ్యాక కొద్దో గొప్పో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కానీ లాక్‌డౌన్ సమయంలో ఊర్లలోకి సామానంతా సర్దుకుని వెళ్లినవాళ్లందరూ మళ్లీ సిటీ బాట పట్టాలంటే జంకుతున్నారు. అలాగని […]

Update: 2020-08-06 03:03 GMT

ఇంట్లో కూర్చుని తింటే ఎంత పెద్ద కొండలైనా కరిగిపోవాల్సిందే. ఇప్పుడు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. గత నాలుగు నెలలుగా చాలా మంది యువత చేస్తున్న పని అదే. ఏ పనీ లేకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చుని తింటున్నారు. మొదట్లో లాక్‌డౌన్ కాబట్టి, ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు అన్‌లాక్ ప్రారంభమయ్యాక కొద్దో గొప్పో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కానీ లాక్‌డౌన్ సమయంలో ఊర్లలోకి సామానంతా సర్దుకుని వెళ్లినవాళ్లందరూ మళ్లీ సిటీ బాట పట్టాలంటే జంకుతున్నారు. అలాగని తినడానికి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది కదా. భూమి ఉన్నవాళ్లు వ్యవసాయం బాట పట్టారు. కానీ వ్యవసాయం చేయలేని వాళ్లు, భూమి లేని వాళ్ల పరిస్థితి ఏంటి? వారి కోసమే ఈ కథనం. ఎలాగూ ఇంతకాలం పని చేసి సంపాదించిన డబ్బు ఉంటుంది కదా, దానికి తోడుగా ఒక లోన్ తీసుకుంటే ఈ చిన్న బిజినెస్‌లు పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడికిప్పుడు లాభదాయకంగా ఉండే చిన్న బిజినెస్‌లు ఏంటో తెలుసుకుందాం!

పౌల్ట్రీ ఫారం..

కోళ్లకు రోగాలు రాకుండా మంచి జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇది ఎవర్‌గ్రీన్ బిజినెస్. ఎక్కువ డబ్బు, పెద్దమొత్తంలో భూమి కూడా అవసరం లేదు. ఇప్పుడెలాగూ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేం కాబట్టి, ఉన్నంతలో చిన్న పౌల్ట్రీ ఫారం స్టార్ట్ చేసుకుంటే మంచిది. చిన్న చిన్న కోడి పిల్లలను కొనుక్కుని వాటిని పెద్దయ్యేవరకు జాగ్రత్తగా పెంచగలిగితే చాలు. వాటిని కొనడానికి హోల్‌సేల్ డీలర్లు రెడీగానే ఉంటారు. ఈ బిజినెస్‌లో వెంటవెంటనే లాభాలు రావు కాబట్టి కాంట్రాక్టు పద్ధతిలో హోల్‌సెల్లర్‌తో ఒప్పందం చేసుకుని అందుకు తగినట్లుగా పెట్టుబడి పెడితే మంచింది.

బట్టల దుకాణం..

ఇప్పుడు ఏ షాపుకి వెళ్దామన్నా జనం భయంతో అల్లాడిపోతున్నారు. అలాగని పెట్టుకున్న పెళ్లిళ్లు, పండగలను ఇంట్లో జరుపుకుంటూనే ఉన్నారు. తక్కువ మందిని పిలుస్తున్నా దుస్తులు కొత్తవి ఉండాలి కదా.. కానీ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి నగరాలకు వెళ్లి షాపింగ్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఊర్లోనే బట్టల దుకాణం పెడితే బాగానే నడుస్తుంది.

డయాగ్నస్టిక్ సెంటర్..

కరోనా ఎలాగూ వచ్చింది కదా అని మిగతా రోగాలు రెస్ట్ తీసుకోవు కదా.. కానీ అవి వస్తే హాస్పిటళ్లకు వెళ్లలేని పరిస్థితి. ఇక డయాగ్నస్టిక్ సెంటర్లను అయితే అస్సలు నమ్మలేకున్నారు. కానీ టెస్టింగ్ చేయకపోతే ఏది ఏ రోగం అనేది బయటపడదు. కాబట్టి గ్రామంలోనే చిన్న డయాగ్నస్టిక్ సెంటర్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అందుకు అర్హత కలిగిన ఓ నలుగురు యువకులు కలిసి ఒక సెంటర్ పెట్టుకుంటే అటు ఊరి వాళ్లకు ఇటు మీకు లాభదాయకంగా ఉంటుంది.

మినరల్ వాటర్ ప్లాంట్..

అది నగరమైనా, గ్రామమైనా.. ఇప్పుడు అందరూ మినరల్ వాటర్ తాగడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే ఈ బిజినెస్ కూడా ఎవర్‌గ్రీన్‌గా మారింది. అయితే ఇప్పటికే చాలా ఊర్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి.. ఒకసారి మీ ఊర్లో, పక్క ఊర్లలో సర్వే చేసి ఈ బిజినెస్ పెట్టడం మంచిది. అదీగాక లాక్‌డౌన్ సమయంలో అందరూ ఊర్లలోకి వచ్చి ఉంటున్నందున ఊర్లో ఉన్న ఒకటి, రెండు మినరల్ వాటర్ ప్లాంట్లకు అందరి అవసరాలు తీర్చడం సాధ్యపడకపోవచ్చు. కనుక, ఇంకొక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం కూడా సబబే.

ఎలక్ట్రానిక్స్, మొబైల్, యాక్సెసరీస్ స్టోర్

అసలే వానాకాలం, ఉరుములు మెరుపులతో, అసంబద్ధ విద్యుత్ ప్రవాహాల కారణంగా షార్ట్ సర్క్యూట్‌లు ఏర్పడి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోవచ్చు. వాటిని బాగు చేయించుకోవాలన్నా, కొత్తది కొనాలన్నా నగరాలకు వెళ్లాలి. కాబట్టి ఎలక్ట్రానిక్ రిపేర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఊర్లోనే ఒక చిన్న షాపు పెట్టుకుంటే సరిపోతుంది.

క్రిమిసంహారక మందుల దుకాణాలు

కరోనా కారణంగా ఎంతమంది పనులు ఆగినా, రైతుల పని ఆగదు కదా.. వర్షం పడగానే దుక్కి దున్నాలి, నారు పోయాలి, విత్తనాలు పెట్టాలి, మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసం క్రిమిసంహారక మందులు, మంచి విత్తనాలు కావాలి. కాబట్టి ఊర్లోనే మంచి నాణ్యత గల మందులను, విత్తనాలను అమ్మితే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

బిజినెస్ ప్రారంభించడానికి ముందు కొన్ని విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగూ వ్యాపారం పెడుతున్నాం కదా.. అని పెద్దమొత్తంలో అప్పులు చేసి పెట్టుబడి పెట్టొద్దు. చిన్న మొత్తం పెట్టుబడితో ప్రారంభించి లాభాలు గడిస్తే నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. అసలే రోజులు బాగా లేవు కాబట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ముందు కొద్దిగా నేపథ్యం తెలుసుకుని, పరిశోధన చేయడం మంచిది. ఒకవేళ బిజినెస్ పెట్టగానే దాన్ని గాలికి వదిలేయకుండా పూర్తి నిబద్ధతతో దాని కోసం పనిచేయాలి. అప్పుడే లాభాలు గడించి, ఊర్లోనే కుటుంబానికి దగ్గరగా నివసించే అవకాశం దొరుకుతుంది.

Tags:    

Similar News