కేసీఆర్ ఇలాకాలో కుంగిన ‘డబుల్’ ఇళ్లు.. వీడియో వైరల్
దిశ ప్రతినిధి, మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆదిలోనే కూలిపోతున్నాయి. లబ్దిదారులు గృహ ప్రవేశం చేసి నెలలు గడవక ముందే నాణ్యతా లోపాలు బహిర్గతమవుతున్నాయి. సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలోని మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ శివారు ముట్రాజ్‌పల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. గతంలో కురిసిన చిన్నపాటి వర్షానికి ఓ ఇంటి గోడ కూలిపోగా.. […]
దిశ ప్రతినిధి, మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆదిలోనే కూలిపోతున్నాయి. లబ్దిదారులు గృహ ప్రవేశం చేసి నెలలు గడవక ముందే నాణ్యతా లోపాలు బహిర్గతమవుతున్నాయి. సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలోని మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ శివారు ముట్రాజ్‌పల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. గతంలో కురిసిన చిన్నపాటి వర్షానికి ఓ ఇంటి గోడ కూలిపోగా.. తాజాగా నిన్న, మొన్న కురిసిన వర్షాలకు ఇంటిలోపలి రూమ్ స్లాబ్ కుంగింది. దీంతో ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివసిస్తున్న భూనిర్వాసితులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
కుంగిన స్లాబ్..
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కోసం ముట్రాజ్‌పల్లిలో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 46వ ఇంటి నెంబర్ డబుల్ ఇళ్లును అందించారు. దీంతో, వారు రెండు నెలల క్రితమే ఆర్ అండ్ ఆర్ కాలనీకి వచ్చారు. ఇటీవల కురిసిన చిరు జల్లులకు మంగళవారం ఉదయం ఇంటి లోపలి రూమ్ స్లాబ్ కుంగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా, ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ ఘటనపై స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ కూలిన ఇంటి గోడ..
రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితుల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లను అత్యంత నాణ్యతతో నిర్మిస్తున్నామని, దేశానికే ఆర్ అండ్ ఆర్ కాలనీ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్, మంత్రులు, జిల్లా అధికారులు చెప్పారు. కానీ, వారి మాటలు ఉత్తి మాటలేనని.. తేలికపాటి వర్షాలకే తెలిసిపోయింది. గతంలో కురిసిన వానలకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో పల్లెపహాడ్ గ్రామానికి చెందిన నర్సింహులుకు చెందిన ఇంటి గోడ కూలింది. అది జరిగిన వారం రోజులకే ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన నాయిని సునీత ఇంటి గోడ సైతం కూలింది. ఇవే కాదు మరికొన్ని ఇండ్లు కూడా కూలిపోయే దశలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ఆందోళనలో ముంపు గ్రామాల ప్రజలు..
తమ కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని వదిలి.. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వచ్చామని, తీరా వచ్చాక.. ఇవి చిన్న పాటి వానలకే కూలిపోతున్నాయని, ఈ ఇళ్లలో ఉండాలంటేనే భయమేస్తోందని ఆర్ అండ్ ఆర్ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రమంతటా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇండ్ల నిర్మాణంలో నాణ్యత లోపం వల్లనే ఇంటి గోడలు కూలడం, ఇంటి లోపల స్లాబ్ కుంగిపోవడం వంటివి సంభవిస్తున్నాయని, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి నాణ్యత లోపించిన ఇండ్లను తిరిగి పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.