వరంగల్ హత్య కేసులో ట్విస్ట్.. షాకింగ్ నిజాలు వెలుగులోకి..
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మమైదాన్‌కు సమీపంలోని ఎల్‌బీనగర్‌లో నివాసముంటున్న చాంద్‌పాషా, అతని భార్య సబీర బేగం, బావమరిది ఖలీల్‌లు బుధవారం తెల్లవారుజామున హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలకు పాల్పడింది చాంద్‌పాషా సొదరుడు షఫీ అతని ఐదుగురు స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్ , […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మమైదాన్‌కు సమీపంలోని ఎల్‌బీనగర్‌లో నివాసముంటున్న చాంద్‌పాషా, అతని భార్య సబీర బేగం, బావమరిది ఖలీల్‌లు బుధవారం తెల్లవారుజామున హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలకు పాల్పడింది చాంద్‌పాషా సొదరుడు షఫీ అతని ఐదుగురు స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్ , మీరా అక్బర్, పాషాలను గురువారం ఉదయం అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. గురువారం సీపీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్ట్‌ను మీడియాకు చూపారు.
ఈసందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ పరకాలకు చెందిన చాంద్‌పాషా, షఫీ సొంత అన్నదమ్ములని, చాలా కాలంగా వీరు ఉమ్మడిగా పశువుల కొనుగోలు, అమ్మకం వ్యాపారం నిర్వహించేవారని తెలిపారు. చాంద్‌పాషా వరంగల్‌లో స్థిరపడగా షఫీ పరకాలలోనే ఉంటున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాలుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డట్లు తెలిపారు. చాంద్‌పాషా నుంచి తనకు కొంత మొత్తం రావాల్సి ఉన్నా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ షఫీ పలుమార్లు పరకాలలో పంచాయితీ నిర్వహించారు. అయితే ఆర్థిక లావాదేవీలు పూర్తయ్యాయని, తాను ఎవరికి ఏం ఇచ్చేది లేదని చాంద్‌పాషా వాదించాడు. పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ నిర్వహించిన సమస్య కొలిక్కి రాలేదు. ఈక్రమంలోనే షఫీకి పశువులు అమ్మిన రైతుల నుంచి డబ్బుల కోసం ఒత్తిడి పెరగడం, దాదాపు రూ.60లక్షల అప్పులు ఉన్నాయి. తన ఆర్థిక ఇబ్బందులకు మూలం అన్న చాంద్‌పాషా మోసమేనంటూ షఫీ పగ పెంచుకున్నాడు. ఈక్రమంలోనే చాంద్‌పాషా కుటుంబాన్నే అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారమే హత్యలు..
చాంద్‌పాషా కుటుంబాన్ని అంతం చేయడానికి తనతో పాటు పనిచేస్తున్న స్నేహితులైన బోయిని వెంకన్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్ , మీరా అక్బర్, పాషాల సహాయం కోరాడు. నెలకిందట వారి అంగీకారం తీసుకున్నాక ఎలా చంపాలో ముందుగా ప్రణాళిక రచించారు. హైదరాబాద్‌లో వేట కత్తులు, చెట్లను కోసే బ్యాటరీ కట్టర్ కొనుగోలు చేసి షఫీ ఇంట్లో భద్రపరుచుకున్నాడు. ప్లానింగ్ ప్రకారం బుధవారం రాత్రి మద్యం సేవించిన ఆరుగురు తెల్లవారుజామున రెండు ఆటోల్లో ఎల్‌బీనగర్‌లోని చాంద్‌పాషా నివాసం చేరుకున్నారు. గేటు దూకి ముందు కరెంట్ మెయిన్ ఆఫ్ చేశారు. అనంతరం బ్యాటరీ కట్టర్‌తో డోర్‌ను కట్ చేసి ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు ఇంట్లోకి ప్రవేశించారు.
ఇంట్లో ఏదో అలజడి జరుగుతుండగా నిద్రలేచిన చాంద్ పాషా కుటుంబ సభ్యుల కంట్లో కారం చల్లి కత్తులతో నరికి చంపారు. చాంద్‌పాషా, అతని భార్య సబీర, చాంద్‌పాషా బావమరిది ఖలీల్, ఇద్దరు కొడుకులు ఫహత్ పాషా, సమీర్ పాషాలపై దాడి చేశారు. చాంద్‌పాషా, సబీర, ఖలీల్‌లను బ్యాటరీ కట్టర్‌తో కోసి చంపగా, ఫహత్ పాషా, సమీర్ పాషాలపై కత్తులతో దాడి చేశారు. చాంద్‌పాషా కుతూరు రుబీనా చంపొద్దని బతిమాలగా వదిలిపెట్టారు. ఖలీల్‌కు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేకున్నా.. బుధవారం ఇంటికి చుట్టుపు చూపుగా వచ్చి హంతకుల చేతిలో మరణించినట్లు సీపీ తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆరుగురు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.