కరోనా వేళ.. సింగరేణిలో గణనీయంగా వృద్ధి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా కష్ట కాలంలోనూ సింగరేణి సంస్థ ఏప్రిల్ నెలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఏడాది ఏప్రిల్‌లో సాధించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు గణాంకాలతో పోల్చి చూస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అద్భుతమైన వృద్ధిని కనపరిచింది. ఏప్రిల్ నెలలో 54.43 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి.. గత ఏడాది సాధించిన 30.4లక్షల టన్నుల రవాణాపై 79.11శాతం వృద్ధిని కనపరిచింది. ఈ ఏప్రిల్లో 48.56లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా కష్ట కాలంలోనూ సింగరేణి సంస్థ ఏప్రిల్ నెలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఏడాది ఏప్రిల్‌లో సాధించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు గణాంకాలతో పోల్చి చూస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అద్భుతమైన వృద్ధిని కనపరిచింది. ఏప్రిల్ నెలలో 54.43 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి.. గత ఏడాది సాధించిన 30.4లక్షల టన్నుల రవాణాపై 79.11శాతం వృద్ధిని కనపరిచింది. ఈ ఏప్రిల్లో 48.56లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి.. గత ఏడాది ఇదే నెలలో సాధించిన 30లక్షల టన్నుల ఉత్పత్తిపై 61.9శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సారి ఏప్రిల్ నెలలో 347లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ వెలికి తీయగా.. గత ఏడాది ఇదే నెల లో వెలికితీసిన 272.2లక్షల క్యూబిక్ మీటర్ లపై 27.5శాతం వృద్ధిని సాధించింది. కరోనా సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సింగరేణి కార్మికులు అధికారులు ఏప్రిల్ నెలలో ఇంతటి వృద్ధిని సాధించడం పట్ల సింగరేణి సీఎండీ ఎన్ .శ్రీధర్ హర్షం ప్రకటిస్తూ.. సంస్థ అధికారులు, కార్మికులకు అభినందనలు తెలియజేశారు.
ఏప్రిల్‌లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యుత్ కర్మాగారాల్లో ఏ మాత్రం బొగ్గు కొరత ఉండరాదన్న ఉద్దేశంతో సింగరేణి వ్యాప్తంగా కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజుకు సగటున 1.80 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేస్తున్నారు. సగటున రోజుకు 31రైల్వే రేకులు చొప్పున.. గత నెల మొత్తం 940 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేశారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధించడం కోసం ఇక నుండి ప్రతి రోజు 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి , రవాణా తో పాటు 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలను సాధించాలని సీఎండీ శ్రీధర్ ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులను కోరారు.
98.53 పి ఎల్ ఎఫ్ సాధించిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం.
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏప్రిల్ నెలలో 822.53మిలియన్ యూనిట్ల విద్యుత్తును 98.53 శాతం పిఎల్ఎఫ్ తో సాధించింది. గత ఏడాది ఇదే నెలలో 72.29 పిఎల్ఎఫ్ మాత్రమే ఉండగా.. ఈ ఏడాది ఇది 26 శాతం వృద్ధిని సాధించింది. ఈ ప్లాంట్లో గల ఒకటో యూనిట్ 411.89 మి.యూ. విద్యుత్తో 98.63 శాతం పిఎల్ఎఫ్ సాధించింది. రెండో యూనిట్ 411.05మి.యూ. విద్యుత్ ఉత్పత్తి చేసి 98.43శాతం పిఎల్ఎఫ్ సాధించింది. ఏప్రిల్లో మొత్తం మీద 98.53% పిఎల్ఎఫ్ తో 822.94మి.యూ. విద్యుత్ ఉత్పత్తి చేసింది. దీనిలో 777.21మి.యూ. రాష్ట్ర అవసరాలకు అందించారు.
సింగరేణి సోలార్ ప్లాంట్ల నుండి 46.95 మె.వా. ఉత్పత్తి.
సింగరేణి సంస్థ ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా నెలకొల్పిన సోలార్ విద్యుత్తు ప్లాంట్ల నుండి ఏప్రిల్ నెలాఖరుకల్లా మొత్తం మీద 46.15 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. మణుగూరు 30మెగావాట్ల ప్లాంట్ నుండి 226లక్షల యూనిట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నుంచి 146 లక్షల యూనిట్లు, ఇల్లందు 39 మెగావాట్ల ప్లాంటు నుండి 61.61 లక్షల యూనిట్లు, రామగుండం 30 మెగావాట్ల ప్లాంటు నుండి 39 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఇటీవల రెండవ ఫేజులో ప్రారంభమైన మందమర్రిలోని రెండు ప్లాంట్ల నుండి 3.9లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. మొత్తం మీద 46.96మిలియన్ యూనిట్ల విద్యుత్తును రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థలకు అనుసంధానం చేయగలిగారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి మొత్తం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నుండి పూర్తిస్థాయి విద్యుత్తును అనుసంధానం చేయనున్నారు.
ఈ ఏడాది అమ్మకాలలో గణనీయ వృద్ధి
గత ఏడాది ఏప్రిల్ నెలలో కేవలం రూ.1201కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.1693కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే 41 శాతం అమ్మకాల్లోనూ వృద్ధి జరిగింది. లాభాల ప్రకారంగా చూసినా గత ఏడాది ఏప్రిల్లో కేవలం రూ.17.65 కోట్లు లాభాలుగా ప్రాథమిక గుర్తించగా.. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.203 కోట్ల రూపాయల వరకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.