అలర్ట్ : రాగల 24 గంటల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంగా భారీ వర్షం..!

దిశ, సిద్దిపేట: రాగల 24 గంటల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసిందని జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి తెలిపారు. తక్కువ సమయంలో జిల్లా వ్యాప్తంగా 20 సెంటిమీటర్ల మేర భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం […]

Update: 2021-07-22 08:16 GMT

దిశ, సిద్దిపేట: రాగల 24 గంటల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసిందని జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి తెలిపారు. తక్కువ సమయంలో జిల్లా వ్యాప్తంగా 20 సెంటిమీటర్ల మేర భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు, అన్ని విభాగాల ఇంజనీర్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలు అధికారులు, పంచాయితీ సెక్రటరీలతో ఐడీఓసీ నుండి జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. భారీ వర్షాల వల్ల ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకైన అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండాలన్నారు.

గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు నేడు, రేపు హెడ్ క్వార్టర్ లోనే ఉంటూ వర్ష పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేయాలన్నారు. డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు తమ పరిధిలోని చెరువులతో సహా అన్ని జలాశయాలను తనిఖీ చేయాలన్నారు. చెరువులకు గండ్లు పడుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో ఈ పని చేయాలని చెప్పారు. మత్య కారులు చేపల వేట కు వెళ్లకుండా చూడాలన్నారు. అదేవిధంగా వర్షకాలంలో గ్రామాలను కలిపే రోడ్ల పై ఉన్న చిన్నచిన్న వాగులు ప్రమాదకరం గా ప్రవహిస్తుంటే అక్కడ ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రత్యేకంగా సిబ్బందినీ పెట్టాలన్నారు.

విద్యుత్, కమ్యూనికేషన్ కు అంతరాయం లేకుండా జాగ్రత్త పడాలన్నారు. వర్షాల వల్ల ఏమైనా ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదురైతే బాధితులకు సత్వర వైద్యం అందించేలా వైద్య అధికారులను, సిబ్బందినీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన వన అధికారులు రైతు బంధు సమితి సభ్యులతో మాట్లాడుతూ నిరంతరం వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ను సూచిస్తూ క్షేత్ర స్థాయిలో రైతులకు ఆ సమాచారం వెళ్లేలా చూడాలన్నారు.

కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో, వ్యవసాయ, ఉద్యానవన, ఆర్అండ్‌బీ, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాలు తమ కార్యాలయాల లో వెంటనే కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం తమ వెంటే ఉన్నామన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రతి అధికారి పై ఉందన్నారు.

ఆర్‌అండ్‌ఆర్ కాలనీ లపై ప్రత్యేక దృష్టి సారించాలి

భారీ వర్షాల నేపథ్యంలో ముట్రాజ్ పల్లి, తునికి బొల్లారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవోలు, పంచాయితీ రాజ్ పర్యవేక్షక ఇంజనీర్, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ లకు సూచించారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ లలో 4 వేలకు పైగా ఇండ్ల నిర్మాణం చేసినందున అక్కడక్కడా కొన్ని ఇండ్ల లో లీకేజీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అలాగే కాలనీలలో లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడ నీరు నిల్వ ఉండడం, మురుగు నీటి కాల్వలు పూడి పోవడం జరిగే అవకాశం ఉందన్నారు. అలాంటి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కాలనీ పైన ఉన్న ప్రాంతాల్లో చెరువులు నుండి వరద క్రిందికి వచ్చే ఆస్కారం ఉన్నందున, వరదనీరు ను కాలనీ క్రింది చెరువుల్లోకి వెళ్లేలా చూడాలన్నారు.

రాజీవ్ రహదారి ప్లాంటేషన్ ను వాయిదా వేయండి

నిరంతర భారీ వర్షాల నేపథ్యంలో రాజీవ్ రహదారి ప్లాంటేషన్ ను వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్ అటవీ, పంచాయితీ రాజ్, ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గాక తిరిగి ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, డీఆర్‌వో బి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఐడీఓసీ లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు

సిద్దిపేట జిల్లాలో గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి తెలిపారు. వర్షాల వల్ల ఏదైనా సమస్యలు తలెత్తితే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం( IDOC )లోని కంట్రోల్ రూమ్ 08457-230000 నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, అత్యవసర సహాయం కావాలన్నా, వర్షాలు, వరదలకు సంబంధించి ఏమైనా ముఖ్య సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్న ప్రత్యేక కంట్రోల్ రూం కు సమాచారం ఇవ్వవచ్చు నని కలెక్టర్ తెలిపారు.

కంట్రోల్ రూమ్ లు 24 గంటలు పని చేస్తుందన్నారు. సమస్యలు కంట్రోల్ రూం ద్వారా అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాల లో కూడ ఇదే మాదిరి ప్రత్యేక కంట్రోల్ రూం లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Tags:    

Similar News