హెల్మెట్ ధరించలేదని పోలీసుల దుశ్చర్య…
దిశ, వెబ్ డెస్క్: హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడి పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పీఎస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీకి దిగారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు శాఖ ఓ ఎస్సై, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దిలీప్‌సింగ్ […]
దిశ, వెబ్ డెస్క్: హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడి పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పీఎస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీకి దిగారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు శాఖ ఓ ఎస్సై, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దిలీప్‌సింగ్ కున్వర్ మాట్లాడుతూ.. ‘ఈ ఘటనతో సంబంధమున్న ఓ ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాం. దీనిపై విచారణకు సైతం ఆదేశించాం’ అని వెల్లడించారు.
రామ్‌పురా గ్రామ నివాసి దీపక్ (20) మిత్రుడితో కలిసి బైకులో పెట్రోల్ పోయించుకునేందుకు స్థానిక పెట్రోల్ బంక్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వారి వాహనాన్ని ఆపారు. అయితే వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఓ పోలీసు వారి బైక్ తాళంచెవిని లాక్కొని దీపక్ నుదిటిపై బలంగా గుచ్చాడు. రక్తస్రావంతోనే ఆ యువకుడు కుటుంబసభ్యులు, గ్రామస్థులకు అసలు విషయాన్ని వివరించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఈ దారుణానికి పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఈ ఘటన పై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే స్థానికులను సముదాయించారు. పోలీసులపై రాళ్లు రువ్విన అంశంపై సూపరింటెండెంట్ మాట్లాడుతూ ‘రాళ్లు రువ్విన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.గాయపడ్డ బాధితుడు దీపక్ ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.