రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం కార్యాలయాల అవసరాల కోసం రూపాయి కూడా విడుదల చేయడం లేదు. ఆయా సంస్థలకు సామాగ్రి సరఫరా చేసే ఏజెన్సీలకు కోట్ల బకాయిలు పడుతోంది. ఈ పద్ధతి నచ్చక ఏజెన్సీలు ప్రభుత్వంతో ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. తాజాగా రవాణా శాఖలో అదే తంతు కొనసాగుతోంది. శాఖలో స్మార్ట్​కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. ఏజెన్సీలకు రూ.కోట్లలో పెండింగ్‌ పెడుతూ ఎగవేసే ధోరణితో ప్రభుత్వం ఉంటుండడంతో పలు సంస్థలు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. […]

Update: 2020-12-05 21:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం కార్యాలయాల అవసరాల కోసం రూపాయి కూడా విడుదల చేయడం లేదు. ఆయా సంస్థలకు సామాగ్రి సరఫరా చేసే ఏజెన్సీలకు కోట్ల బకాయిలు పడుతోంది. ఈ పద్ధతి నచ్చక ఏజెన్సీలు ప్రభుత్వంతో ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. తాజాగా రవాణా శాఖలో అదే తంతు కొనసాగుతోంది. శాఖలో స్మార్ట్​కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. ఏజెన్సీలకు రూ.కోట్లలో పెండింగ్‌ పెడుతూ ఎగవేసే ధోరణితో ప్రభుత్వం ఉంటుండడంతో పలు సంస్థలు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. కొత్త ఏజెన్సీలకూ అవే ఇబ్బందులు మొదలవుతున్నాయి తప్ప ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఫలితంగా రవాణా శాఖలో మూడు నెలలుగా కార్డుల జారీ ప్రక్రియ సవ్యంగా సాగడం లేదు. రోజూ వాహనదారులు కార్యాలయాల చుటూ తిరుగుతూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్తున్నారు. ఇదే అదునుగా పరిమిత కార్డులతో వాహనదారుల అవసరాలను ఆసరగా చేసుకొని దళారులు దందా జోరుగా సాగిస్తున్నారు.

రవాణా శాఖలో ఏడాది కాలంగా కార్డుల కొరత సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అప్పటికప్పుడు ఏవో కొన్ని కార్డులను దిగుమతి చేసుకొని డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ పత్రాలను ముద్రించి వాహనదారులకు అందజేస్తున్నారు. కానీ రెండు, మూడు నెలల్లోనే కొరత సమస్య తిరిగి తలెత్తుత్తోంది. స్మార్టు కార్డులతో పాటుగా వాటిలో వివరాలను ముద్రించేందుకు అవసరమయ్యే రిబ్బన్‌లను ఆర్టీఏకు విక్రయించే సంస్థలకు కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండడం వల్లనే తరచుగా ఈ సమస్య తలెత్తుతోంది.

ఇక్కడ తీసుకుంటున్నారు.. అక్కడిస్తలేరు

డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్సీ ఏదైనా స్మార్ట్‌కార్డు రూపంలో ఉంటేనే వాహనదారుడికి గుర్తింపు లభిస్తుంది. డ్రైవింగ్‌ లైసెన్సు కోసం రూ.1550 ఆన్‌లైన్‌లో ముందే చెల్లిస్తున్నారు. వాహనాలు కొనుగోలు చేసిన సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు, వాటి శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌తో సహా ఇతర అన్ని ఫీజులను షోరూమ్‌లో చెల్లిస్తారు. ఇలా ఫీజుల రూపంలోనే రవాణాశాఖ వినియోగదారుల నుంచి ప్రతియేటా రూ.వందల కోట్లు వసూలు చేస్తుంది. అయితే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నా ఏజెన్సీలకు మాత్రం పెండింగ్​ పెడుతున్నారు. గతంలో పూనేకు చెందిన కొన్ని ప్రైవేట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు స్మార్టు కార్డులను తయారు చేసి ఇచ్చేవి. కానీ రవాణాశాఖ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు చేతులెత్తేశాయి. పూనే సంస్థలకు రూ.18 కోట్లు బాకీ పడింది. దీంతో ఏకంగా ఆ సంస్థలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన సీఎంఎస్, ఎంటెక్, టీసీఎస్​తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ కొంతకాలంగా వీటికి సంబంధించిన రూ.4కోట్ల బిల్లులను కూడా చెల్లించడం లేదు. దీంతో ఈ సంస్థలు కూడా కార్డుల పంపిణీ నిలిపివేసి ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి.

జోరుగా బ్రోకర్ల దందా

రాష్ట్రంలోని ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 200 నుండి 400 వరకు స్మార్ట్‌కార్డుల డిమాండ్‌ ఉంటుంది. పలు కార్యాలయాల్లో పరిమితకార్డులతో నెట్టుకొస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. రోజులతరబడి వాహనదారులు కార్యాలయాల చుట్టూ తిరగుతూ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా తీసుకొని దళారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పరిమితంగా ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది, బ్రోకర్లు ఒక్కో కార్డును రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల కూడా పట్టించుకోకపోవడంతో వారి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్డుల కొరత లేకుండా చూడాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News