హైకోర్టుల్లో జడ్జీల కొరత
దిశ, తెలంగాణ బ్యూరో: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మొదలు అనేక రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో జడ్జీల కొరత ఏర్పడింది. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరైతే జనవరి 15వ తేదీ నాటికి నలుగురి కొరత ఉంది. 30 మంది న్యాయమూర్తులు మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ బదులిచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టు (25 రాష్ట్రాలు)ల్లో మొత్తం 1,079 జడ్జీల పోస్టులు మంజూరైతే అందులో 668 న్యాయమూర్తులు మాత్రమే […]
దిశ, తెలంగాణ బ్యూరో: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మొదలు అనేక రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో జడ్జీల కొరత ఏర్పడింది. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరైతే జనవరి 15వ తేదీ నాటికి నలుగురి కొరత ఉంది. 30 మంది న్యాయమూర్తులు మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ బదులిచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టు (25 రాష్ట్రాలు)ల్లో మొత్తం 1,079 జడ్జీల పోస్టులు మంజూరైతే అందులో 668 న్యాయమూర్తులు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 411 ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం మంజూరైన పోస్టుల్లో సుమారు 38% ఖాళీగానే ఉన్నాయి.
2019 డిసెంబరు 11 నాటికి కేవలం ఒక్క జడ్జి పోస్టు మాత్రమే ఖాళీగా ఉంటే ఇప్పుడు మరో మూడు తోడయ్యాయి. పలువురు జడ్జీలు పదవీ విరమణ చేయడం, కొత్త జడ్జీల నియామకం జరిగినా ఖాళీ పోస్టులు మాత్రం పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. తెలంగాణ విషయాన్నే చూసుకుంటే మొత్తం 24 న్యాయమూర్తుల పోస్టులు మంజూరైతే అందులో 14 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ఉన్న 24 పోస్టుల్ని 42కు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే విజ్ఞప్తి చేసింది. ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా వ్యక్తిగతంగా కేంద్రానికి లేఖ రాసి న్యాయమూర్తుల పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. అదనపు పోస్టులకు అనుమతి రావడం సంగతేమోగానీ మంజూరైన పోస్టుల్లోనే దాదాపు 40% ఖాళీగా ఉండడం గమనార్హం.
రాష్ట్రంలోని జిల్లా, క్రింది స్థాయి కోర్టుల్లో సైతం ఖాళీ పోస్టులు గణనీయంగానే ఉన్నాయి. ఈ కోర్టుల్లో మొత్తం 413 మంది జడ్జీ పోస్టులు ఉంటే అందులో 334 పోస్టులకు జడ్జీలు ఉన్నారు. ఇంకా 79 ఖాళీగానే ఉన్నాయి (2019 డిసెంబరు 11 నాటికి). ఇక అన్ని రాష్ట్రాల్లోని కిందిస్థాయి కోర్టుల్లోని జడ్జీల సంఖ్యను పరిశీలిస్తే మొత్తం 23,597 మంజూరైతే 18,144 మంది ఉన్నారు. ఇంకా 5,453 పోస్టులకు జడ్జీల కొరత ఉంది. హైదరాబాద్‌కు చెందిన కరీం అన్సారీ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి అరుణ్ కుమార్ అగర్వాల్ జనవరి 8న లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో సుప్రీంకోర్టులో నలుగురు, అన్ని హైకోర్టుల్లో కలిపి 411 మంది జడ్జీల కొరత ఉందని పేర్కొన్నారు.