చిరుతలకు జీపీఎస్ ట్రాకింగ్
దిశ, ఫీచర్స్ : ముంబై నగరంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్(ఎస్‌ఎన్‌జీపీ)లో గల ఐదు చిరుతపులులకు ‘రేడియో కాలరింగ్ (జీపీఎస్ కాలర్) అమర్చారు. చిరుత పులులకు ఈ తరహా ప్రాజెక్ట్ చేపట్టడం ఇదే తొలిసారి కాగా.. అటవీ శాఖ, వన్యప్రాణి జీవశాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ సర్వేను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జులై 2020లోనే ఆమోదం తెలపగా, ఇటీవలే దీన్ని అమలు చేశారు. ఇక చిరుతపులులకు అమర్చిన రేడియో కాలరింగ్ ద్వారా పార్క్ […]
దిశ, ఫీచర్స్ : ముంబై నగరంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్(ఎస్‌ఎన్‌జీపీ)లో గల ఐదు చిరుతపులులకు ‘రేడియో కాలరింగ్ (జీపీఎస్ కాలర్) అమర్చారు. చిరుత పులులకు ఈ తరహా ప్రాజెక్ట్ చేపట్టడం ఇదే తొలిసారి కాగా.. అటవీ శాఖ, వన్యప్రాణి జీవశాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ సర్వేను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జులై 2020లోనే ఆమోదం తెలపగా, ఇటీవలే దీన్ని అమలు చేశారు. ఇక చిరుతపులులకు అమర్చిన రేడియో కాలరింగ్ ద్వారా పార్క్ లోపల, అటవీ ప్రాంతంలో అవి ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి కదలికలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోనున్నారు. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ప్రాజెక్ట్.. చిరుతపులల గురించి సైంటిఫిక్‌గా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు అసలు ‘రేడియో కాలర్’ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
జంతువుల సంచార విషయాలు, వలసల కోసం ఈ ట్రాకింగ్ కాలర్స్‌ను ఉపయోగిస్తారు. కొంతమంది పెంపుడు జంతువుల యజమానులు తమ పెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎటు తిరుగుతున్నాయి? వంటి విషయాలను తెలుసుకునేందుకు ఈ కాలర్‌లను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అధికారులు ‘సావిత్రి’ అనే పేరుగల మూడేళ్ల ఆడ చిరుతపులికి ‘రేడియో కాలర్’ అమర్చి, అడవిలో వదిలేశారు. దాంతో కాలర్‌లు ఉపగ్రహానికి సంకేతాలు పంపి, చిరుతపులి ఎక్కడ ఉంది? ఏం చేస్తుందనేదన్న విషయాలను తెలియజేస్తుంది. గతంలో కెమెరా ట్రాప్‌ల ద్వారా చిరుతపులుల కదలికలను తెలుసుకునేవారు. కాగా చిరుతల సంచారం గురించి తెలుసుకొని, అవి జనవాసాల్లోకి రాకుండా చేసేందుకే రేడియో కాలర్‌లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు వివరించారు.
‘ఫిల్మ్ సిటీ, ఎస్‌ఎన్‌జీపీ చుట్టూ ఉన్న బెల్ట్ ప్రాంతంలో చిరుత పులులను ట్రాక్ చేసేందుకు సావిత్రి మాకు ఉపయోగపడనుంది. భారతీయ సాంఘిక సంస్కర్త, విద్యావేత్త సావిత్రిబాయి ఫూలే పేరు మీదనే ఈ చిరుతపులికి ఆ పేరు పెట్టాం. ఈ సావిత్రి ముంబైలోని చిరుతపులుల విషయంలో మాకు ఒక మార్గాన్ని చూపుతుందని, వాటి గురించి జ్ఞానాన్ని అందింస్తుందని మేము ఆశిస్తున్నాం. ముంబైలోని చిరుతలను బాగా అర్థం చేసుకోవడానికి, వాటిని అధ్యయనం చేయడానికి, శాటిలైట్ కాలర్లను ఉపయోగించడం సరైంది. ఈ ప్రత్యేక అధ్యయనం అటవీ శాఖకు సాయపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిరుతల సంచార విధానం, బిజీగా ఉండే ట్రాఫిక్ రోడ్ల మీదుగా వాటి కదలికలు ఎలా ఉంటాయి, మానవులను నుంచి అవి ఎలా తప్పించుకుంటాయి వంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈ బిజీ నగరంలో చిరుతపులికి సమర్థవంతమైన పరిరక్షణ నమూనాలను అమలు చేయడం ముఖ్యం. ఈ ప్రాజెక్ట్ అందుకు సాయం చేస్తుంది’ అని ఎస్‌ఎన్‌జీపీ అటవీ చీఫ్ కన్జర్వేటర్ జి. మల్లికార్జున అన్నారు.