కోట్లు కుమ్మరిస్తున్న సీతారామ ప్రాజెక్టు మట్టి.. రాత్రికి రాత్రే టన్నుల్లో మాయం!
దిశ, అన్నపురెడ్డిపల్లి : ప్రభుత్వ సొమ్మును ఆ ప్రజా ప్రతినిధి తన సొంత సొమ్ములా భావించాడేమో.. లేదా ప్రజాప్రతినిధి అన్న ధీమానో తెలియదు. ఖద్దరు చొక్కా వెనుక ఎన్ని అక్రమాలు చేసినా ఎవరు పట్టించుకోరని అనుకున్నాడో ఏమో, ఏకంగా ప్రభుత్వం నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు మట్టిపై కన్నేశాడు. డంపు చేసిన మట్టిని దర్జాగా తరలించుకుపోయాడు. ప్రభుత్వానికి ఎలాంటి చలానాలు కట్టకుండా ప్రభుత్వ సొమ్మును కాజేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డి పల్లి మండలం గుంపెన గ్రామం వద్ద […]
దిశ, అన్నపురెడ్డిపల్లి : ప్రభుత్వ సొమ్మును ఆ ప్రజా ప్రతినిధి తన సొంత సొమ్ములా భావించాడేమో.. లేదా ప్రజాప్రతినిధి అన్న ధీమానో తెలియదు. ఖద్దరు చొక్కా వెనుక ఎన్ని అక్రమాలు చేసినా ఎవరు పట్టించుకోరని అనుకున్నాడో ఏమో, ఏకంగా ప్రభుత్వం నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు మట్టిపై కన్నేశాడు. డంపు చేసిన మట్టిని దర్జాగా తరలించుకుపోయాడు. ప్రభుత్వానికి ఎలాంటి చలానాలు కట్టకుండా ప్రభుత్వ సొమ్మును కాజేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డి పల్లి మండలం గుంపెన గ్రామం వద్ద మట్టి కుంభకోణంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల ప్రజాప్రతినిధి అయ్యుండి ప్రజలకు సేవ చేయాల్సిన వారే, ప్రభుత్వం, ప్రజల సొమ్మును కాజేసి, తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఉన్నాడు. అధికారులు కూడా ఇదంతా జరిగి వారం రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
గుంపెన గ్రామం వద్ద జాతీయ రహదారికి కూతవేటు దూరంలోనే అర్ధరాత్రి భారీ స్థాయిలో మట్టి దందా జరిగినప్పటికీ అధికారులు అటువైపు చూడలేదంటే అర్థం చేసుకోవచ్చు. రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్న చందంగా మారింది అక్కడి పరిస్థితి. ఆ ప్రజా ప్రతినిధి రాత్రిపూట తన సొంత జేసీబీల సహాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పెట్టి ఇష్టానుసారంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేశాడు. సీతారామ ప్రాజెక్టు అధికారులు మాత్రం మట్టిని తరలించుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. ఆ మట్టి పై నిఘా కూడా పెట్టామని అధికారులు చెబుతున్నారు. అయితే, 2 వేల ట్రక్కులకు పైగా మట్టి ఆ నిఘాకు కూడా చిక్కకుండా ఎలా తరలిపోయిందో అధికారులే సమాధానం చెప్పాలి మరీ.
మట్టిని కాజేసిన వ్యక్తి కూడా మండలంలో కలరింగ్ ఇచ్చుకుంటూ తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పుకుంటూ తిరుగుతుండటం అక్కడి అధికారుల నిస్సహాయతను తెలియజేస్తుంది. నేషనల్ హైవే పక్కనే ఇంత భారీ స్థాయిలో మట్టి దందా జరిగిందంటే, లోలోపల ఇంకెంత దోపిడికి పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. అర్థరాత్రి టన్నుల కొద్దీ మట్టి మాయం అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోక పోవడంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. వారికి కూడా ఇందులో వాటా ఉండే ఉంటుందని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.