కళలు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి
కళలు ప్రదర్శించడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బానోత్ కళావతిబాయి అన్నారు.
దిశ, మధిర : కళలు ప్రదర్శించడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బానోత్ కళావతిబాయి అన్నారు. రామభక్త సీతయ్య కళాపరిషత్ ఆధ్వర్యంలో 27వ జాతీయస్థాయి మధిర బాలోత్సవ్ పోటీలు మండల కేంద్రంలోని బంజారా కాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శనివారం రెండవ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గత 27 సంవత్సరాల నుండి రామభక్త సీతయ్య కళాపరిషత్ నిర్వాహకులు పుతుంభక శ్రీకృష్ణప్రసాద్, మధిర సాంసృతిక రథసారధి మధిర బాబ్లు ( బాబూరావు ) మిత్ర బృందం సేవలు అభినందనీయం అన్నారు. అదే విధంగా చిన్న పిల్లలను ప్రోత్సహిస్తూ వారిలో కళలను వెలికితీస్తూ ముందు తరాల వారికి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడం అభినందనీయం అన్నారు.
అనంతరం వివిధ కళలు ప్రదర్శించిన పిల్లలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిమిక్రీ కళా కారుడు లంకా కొండయ్య ఏర్పాటు చేసిన నేను నా మధిర కార్యక్రమం లో భాగంగా ఆరోగ్య శాఖ తరపున వేదిక మీద నో ప్లాస్టిక్ యూజ్ అంటూ పనికి రాని పాత వస్త్రాలతో తయారు చేసిన సంచులను డీఎం హెచ్ ఓ, శ్రీకృష్ణ ప్రసాద్ , నిర్వాహకులు బాబ్లు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి సురేష్, సీనియర్ అభ్యుదయ కళాకారిణి వైరా బేగం, ఎర్రుపాలెం కళాకారుడు హేమంతరావు, వేటూరి హరినాథ్, టి.నాగిరెడ్డి తదితరులు అందజేశారు.