డ్రైవర్ పై కాంట్రాక్టర్ దౌర్జన్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనుల కాంట్రాక్టర్ రోడ్డు ప్రమాద బాధితుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

Update: 2024-11-16 10:53 GMT

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనుల కాంట్రాక్టర్ రోడ్డు ప్రమాద బాధితుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​ నుండి రాజమండ్రికి ట్రాలీ వాహనంలో మొక్కజొన్నల విత్తనాల లోడు వెళ్తుంది. శనివారం తెల్లవారుజామున అశ్వారావుపేటకు రాగా లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా ఉన్న డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాజమండ్రికి చెందిన ట్రాలీ డ్రైవర్ మచిగిరి నూకరాజుకు స్టీరింగ్ బలంగా తగిలి పలుచోట్ల గాయాలు అయ్యాయి. నిర్మాణంలో ఉన్న డివైడర్ కూడా స్వల్పంగా దెబ్బతింది. దాంతో బాధితుడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని వాహనం వద్దే వేచి ఉన్నాడు. ఈ క్రమంలో బాధితుడిపై సెంట్రల్ లైటింగ్ కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

    వాహనం ఢీకొనడం వల్ల దెబ్బతిన్న డివైడర్ నిర్మాణానికి నష్టపరిహారం చెల్లించాలని డ్రైవర్ తో గొడవకు దిగాడు. నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడి వాహనంలోని లోడ్ పర్మిషన్ పేపర్లను బలవంతంగా లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో బాధిత డ్రైవర్ లోడ్ పేపర్లను తిరిగి ఇవ్వాలని స్థానిక యూనియన్ పెద్దలను ఆశ్రయించాడు. ఎటువంటి ప్రమాద సూచికలు కానీ రేడియం స్టిక్కరింగ్ బోర్డులు లేకపోవడంతోనే ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొట్టినట్టు డ్రైవర్ వాపోయాడు. నిర్మాణంలో ఉన్న డివైడర్ వద్ద భద్రతా చర్యలు పాటించకుండా రోడ్డు ప్రమాదానికి పరోక్షంగా కారణమైన కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రమాదానికి బాధ్యత వహించాల్సిన కాంట్రాక్టర్ దురుసుగా ప్రవర్తించడాన్ని తెలుసుకున్న స్థానికులు అక్కడికి వచ్చి బాధితునికి న్యాయం చేయాలని కోరారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఇటీవల ఇదే డివైడర్ ను ఢీకొని పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. 


Similar News