జగన్ ఢిల్లీ పర్యటన అందుకోసమేనా?

దిశ, తెలంగాణ బ్యూరో : వరుసగా ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు ఈ మధ్య ఢిల్లీ బాట పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలతో భేటీ కానున్నారు. ఇంత హడావిడిగా ఢిల్లీ పర్యటన ఎందుకో అనే సందేహాలు మొదలయ్యాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక విషయమై వైఎస్సార్సీపీ-బీజేపీల మధ్య పరస్పర అవగాహన కోసమేనని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రైతులు ఈ నెల 17వ […]

Update: 2020-12-15 01:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వరుసగా ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు ఈ మధ్య ఢిల్లీ బాట పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలతో భేటీ కానున్నారు. ఇంత హడావిడిగా ఢిల్లీ పర్యటన ఎందుకో అనే సందేహాలు మొదలయ్యాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక విషయమై వైఎస్సార్సీపీ-బీజేపీల మధ్య పరస్పర అవగాహన కోసమేనని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రైతులు ఈ నెల 17వ తేదీన తలపెట్టిన జాతీయస్థాయి దీక్షలో భాగంగా ఏపీలోని రైతులు కూడా ఆందోళనలు చేసి మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నందున దాన్ని నివారించాలని జగన్‌కు స్పష్టం చేయడం కోసమని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. భేటీలు ముగిసిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఇప్పటికే బీజేపీ, జనసేన మధ్య భేదాభిప్రాయాలను సృష్టించగా ఇప్పుడు వైఎస్సార్సీపీ కూడా తోడైంది. సిట్టింగ్ స్థానంగా ఉన్న తిరుపతిని వదులుకునే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. కానీ ఈసారి ఈ సీటును కొట్టేయాలని బీజేపీ అనుకుంటోంది. అందులో భాగంగా దీటైన అభ్యర్థి కోసం బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించింది. వైఎస్సార్సీపీ డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేసింది. ఇంతకాలం రెండు పార్టీల మధ్యే పోరు ఉందనుకుంటున్న తరుణంలో జనసేన సైతం ఎంటర్ అయ్యి బీజేపీ మద్దతుతో అభ్యర్థిని నిలబెట్టనున్నట్లు ప్రకటించింది.

కానీ ఆలస్యంగా రంగ ప్రవేశం చేసిన బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు వదిలే ప్రసక్తే లేదని, స్వంత అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రెండు రోజుల క్రితం తిరుపతిలో పార్టీ కార్యనిర్వాహకవర్గ సమావేశాన్ని నిర్వహించి జనసేన మద్దతుతో అభ్యర్థిని నిలబెడుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో జనసేన పవన్ కల్యాణ్ గందరగోళంలో పడ్డారు. చాలారోజుల ముందుగానే ఢిల్లీ వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి అభ్యర్థిని నిలబెడుతున్నట్లు చెప్పి ఆమోదం తీసుకోగా ఇప్పుడు ప్లేటు ఫిరాయించడమేంటనే చర్చ మొదలైంది. జీహెచ్ఎంసీలో పోటీ చేయకుండా త్యాగం చేసింది తిరుపతిలో పోటీ చేయడం కోసమే కదా అని జనసేన నాయకులు వాదిస్తున్నారు. అది మీకు.. ఇది మాకు.. అనే ఒప్పందాన్ని ఇప్పుడు ఎందుకు ఉల్లంఘించాల్సి వస్తోందనే జనసేన నేతల ప్రశ్నలకు బీజేపీ నుంచి సమాధానం కరువైంది.

తిరుపతిలో రెండు పార్టీల మధ్య పోటీ చివరకు త్రిముఖ పోరుగా మారింది. జనసేన, బీజేపీలు ఎవరిని నిలబెట్టాలనేది ఖరారు కాకపోయినా ముగ్గురి మధ్య పోటీ అనివార్యమని తేలిపోయింది. ఇంతకాలం ఏపీలో జనసేన-బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. తిరుపతి ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల మధ్య వేడి పుట్టించింది. జనసేన దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, బీజేపీ బలం పుంజుకోవడం తిరుపతి నుంచే ప్రారంభం కావాలని ఆ పార్టీ నేతలు గట్టిగానే అభిప్రాయపడుతున్నారు. జనసేన, బీజేపీలలో ఏది ఎవరికి మద్దతు ఇస్తుందని, ఏ పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందనేది త్వరలో తేలిపోనుంది.

ఈ ఘర్షణ ఇలా ఉన్న సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుపతి విషయంలో అభ్యర్థిని నిలబెట్టినా చూసీ చూడనట్లుగా పోవాలని, బీజేపీ అభ్యర్థి గెలుపుకు మార్గం సుగమం చేయాలన్న ప్రతిపాదనను జగన్ ముందు ఉంచే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న బీజేపీ తిరుపతి నుంచే ఏపీలో కూడా ప్రయోగం చేయాలనుకుంటోంది. చాలా కాలం నుంచి “తిరుపతిలో కూడా దుబ్బాక సీన్ రిపీట్ అవుతుంది, అక్కడి ఫలితాలే మాకు స్ఫూర్తి” అనే వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. దీన్నిబట్టి ఇక బీజేపీ అభ్యర్థి పోటీ చేయడం ఖాయమని, జనసేన కూడా అనివార్యంగా మద్దతు ఇస్తుందని, వైఎస్సార్సీపీతో పరస్పర అవగాహన ద్వారా గెలుపు తథ్యం అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ చర్చలకు ఫుల్‌స్టాప్ పడనుంది.

Tags:    

Similar News