వరద సాయానికి బ్రేక్ వేసింది మేమే
‘లేఖ’ చుట్టు రాజకీయానికి ఎస్ఈసీ ఫుల్స్టాప్ పెట్టింది.. బల్దియా ఎన్నికల వేళ ‘వరద సాయాన్ని’ వాడుకుందామనుకున్న పార్టీల నోళ్లకు కమిషన్ తాళం వేసింది.. మేమందించే నోటి కాడి బుక్కను అడ్డుకుంటున్నారని అధికార పార్టీ, ఆ పాపంలో మా పాత్రేమీ లేదని బీజేపీ సంధించుకుంటున్న ‘లేఖా’స్ర్తాలకు ఫుల్స్టాప్ పెట్టింది.. నిబంధనల మేరకు సాయానికి బ్రేక్ వేసే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఎవరూ తమకు లేఖలు రాయలేదని స్పష్టం చేసింది.. పాత దరఖాస్తులకు ఒకే చెబుతూ కొత్త వాటి విషయంలోనే […]
‘లేఖ’ చుట్టు రాజకీయానికి ఎస్ఈసీ ఫుల్స్టాప్ పెట్టింది.. బల్దియా ఎన్నికల వేళ ‘వరద సాయాన్ని’ వాడుకుందామనుకున్న పార్టీల నోళ్లకు కమిషన్ తాళం వేసింది.. మేమందించే నోటి కాడి బుక్కను అడ్డుకుంటున్నారని అధికార పార్టీ, ఆ పాపంలో మా పాత్రేమీ లేదని బీజేపీ సంధించుకుంటున్న ‘లేఖా’స్ర్తాలకు ఫుల్స్టాప్ పెట్టింది.. నిబంధనల మేరకు సాయానికి బ్రేక్ వేసే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఎవరూ తమకు లేఖలు రాయలేదని స్పష్టం చేసింది.. పాత దరఖాస్తులకు ఒకే చెబుతూ కొత్త వాటి విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేసింది. మొత్తంగా వరద పాలి‘ట్రిక్స్’తో బురదమయంగా మారిన గ్రేటర్ వ్యవహారం ఎస్ఈసీ ప్రకటనతోనైనా గాడిలో పడుద్దో లేదో చూడాలి మరీ..
దిశ, తెలంగాణ బ్యూరో : వరద సాయం నిలిపివేతపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపణలు ఉత్తివే అని తేలిపోయింది. వెల్లువలా వస్తున్న కొత్త దరఖాస్తులతో సాయం పంపిణీకి ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. వాస్తవంగా గతంలో దరఖాస్తులు చేసుకుని ఉంటే, దానికి సాయం పంపిణీ చేస్తే ఆన్ గోయింగ్ పథకంగా గుర్తించి కోడ్ పరిధిలోకి తీసుకోరని పేర్కొంది. కానీ దరఖాస్తు చేసుకోవడానికి లక్షల సంఖ్యలో ప్రజలు మీ సేవ కేంద్రాల దగ్గర బారులు తీరిన నేపథ్యంలో కొత్త నమోదుగా భావించి షెడ్యూల్ జారీ చేసిన మరునాడు బ్రేక్ వేయాల్సి వచ్చిందని ఎస్ఈసీ వివరించింది.
పాత దరఖాస్తులకు ఓకే..
ఈసీ రూల్స్ ప్రకారం షెడ్యూల్ జారీ చేసిన రోజు ఎస్ఈసీ కమిషనర్ పార్థసారధి అప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే పంపిణీ ఉంటుందనే కోణంలో వరదసాయం కొనసాగుతుందని ప్రకటించారు. కొత్తగా దరఖాస్తులు తీసుకునే అంశాలపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నోటిఫికేషన్ జారీ అయినా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ నిలిపివేయలేదు. కొత్తగా దరఖాస్తులు తీసుకునే అంశాన్ని మాత్రం కొత్త పథకంగా గుర్తించారు. షెడ్యూల్ జారీ చేయడానికి ముందు దరఖాస్తులకు వరద సాయం బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే కోడ్ పరిధికి వర్తించదు. షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకుని, కొత్తగా మంజూరు చేయాల్సి వస్తే దానికి కోడ్ వర్తిస్తుందని ఎస్ఈసీ గుర్తించింది. దీంతో పథకానికి బ్రేక్ వేసిందని వెల్లడైంది.
సాయం చుట్టే రాజకీయం..
గ్రేటర్లో వరద సాయం చర్చతో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా వరదసాయాన్ని బీజేపీ అడ్డుకుందని, ఆ పార్టీ అధ్యక్షుడు సంజయ్ ఈసీకి లేఖ రాశాడంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ఆరోపణలు సంధించారు. సాయం ఆగిపోవడానికి కమల దళమే కారణమంటూ టీఆర్‌ఎస్ నేతలు విమర్శలకు దిగగా, ఆ లేఖతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సంజయ్ ప్రకటించారు. తమను దొంగదెబ్బ తీయడానికి సీఎం కేసీఆర్ లేఖ నాటకం ఆడుతున్నారని సంజయ్ ఎదురుదాడికి దిగారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ సంజయ్ రాసింది కాదని సీసీఎస్‌లో ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. లేఖపై నిజానిజాలు తేల్చుకోవడానికి సిద్ధమని సీఎం కేసీఆర్‌కు సంజయ్ సవాలు విసిరారు.
బైక్ ర్యాలీగా చార్మినార్‌కు..
ఈ క్రమంలోనే చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సంజయ్ సవాల్ చేశారు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్ వరకు శుక్రవారం కాషాయదళం బైక్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి సంజయ్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను లేఖ రాస్తే సాయం ఆపారని ప్రచారం చేశారని సీఎం స్వయంగా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ప్రజల దృష్టి మళ్లించేవిధంగా సీఎం స్థాయి దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీని బూచిగా చూపుతున్నారని ఆరోపించారు. సవాల్‌ను స్వీకరించకుండా కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇక టీఆర్‌ఎస్ పని అయిపోయిందని కేసీఆర్‌కు అర్థమైందని, వరద సాయం రూ. 550 కోట్లలో సగం టీఆర్‌ఎస్ నేతలే మింగేశారని ఆరోపించారు. కాగా, బైక్ ర్యాలీకి మొదట అనుమతి లేదని చెప్పిన పోలీసులు తరువాత పర్మిషన్ ఇస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.