జియో ఫైబర్‌లో సౌదీ సంస్థ పెట్టుబడులు!

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియో (reliance jio) లో ప్రపంచ దిగ్గజాల నుంచి వరుస పెట్టుబడులను రాబట్టిన దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుస సంచలనాలతో దూసుకెళ్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ విలువను సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇటీవల దాని అనుబంధ సంస్థలలో పెట్టుబడులను సమీకరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తాజాగా, జియో ఫైబర్ (jio fiber) ఆస్తులలో పెట్టుబడుల కోసం సౌదీ అరేబియా ఆధారిత పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF)కు తన అనుబంధ […]

Update: 2020-08-21 04:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియో (reliance jio) లో ప్రపంచ దిగ్గజాల నుంచి వరుస పెట్టుబడులను రాబట్టిన దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుస సంచలనాలతో దూసుకెళ్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ విలువను సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇటీవల దాని అనుబంధ సంస్థలలో పెట్టుబడులను సమీకరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

తాజాగా, జియో ఫైబర్ (jio fiber) ఆస్తులలో పెట్టుబడుల కోసం సౌదీ అరేబియా ఆధారిత పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF)కు తన అనుబంధ సంస్థలో అధిక వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జియో ఫైబర్ ఆస్తులను పీఐఎఫ్‌కు విక్రయించడం ద్వారా 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,488 కోట్లు) విలువైన పెట్టుబడులను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకునే అవకాశాలున్నాయి.

అంతేకాకుండా, పీఐఎఫ్‌తో పాటు..దాని ప్రత్యర్థి సంస్థ అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ) సైతం రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 300 బిలియన్ డాలర్ల విలువైన ఈ పోర్ట్‌ఫోలియోను సాధించేందుకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. కానీ, ఈ ఒప్పందం గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ (reliance industries) సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ చర్చలు ఒప్పందం దిశగా సాగుతాయా లేదా చెప్పలేమంటున్నారు.

ఒకవేళ ఈ రెండు ఒప్పందాలు నిర్ధారణ అయితే గనక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు రాబోయే కాలంలో మరింత బలపడుతాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పీఐఎఫ్, ఏడీఐఏ సంస్థలు ఇదివరకే రిలయన్స్ జియోలో భారీగా పెట్టుబడులను పెట్టాయి. వాటి ఒప్పందం విలువ 2.2 బిలియన్ డాలర్లు. అలాగే, మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే దిగ్గజ ఆయిల్ కంపెనీ సౌదీ అరామ్‌కో Saudi Aramco).. రిలయన్స్ పెట్రో కెమికల్ రిఫైనింగ్ (Reliance Petrochemical Refining) వ్యాపారంలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థతో చర్చలను జరుపుతున్న సంగతి తెలిసిందే.

సౌదీ ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈ సంస్థ రెండు ప్రధాన పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. మహారాష్ట్రలోని గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ (green field petrolium refinery) లో వ్యూహాత్మక పెట్టుబడితో పాటు పెట్రో కెమికల్స్ వ్యాపారంలో 15 బిలియన్ డాలర్ల విలువైన వాటాను పొందేందుకు చర్చలు జరుపుతోంది. చమురు ఉత్పత్తిదారు అయిన సౌదీ అరామ్‌కో, రిఫైనరీ సంస్థ రిలయన్స్ మధ్య స్వచ్ఛమైన ఒప్పందం ఉండనుందని, ఇరు కంపెనీల మధ్య అనుబంధాన్ని వ్యూహాత్మక భాగస్వాములుగా చేసుకోవాలని భావిస్తున్నట్టు అంబానీ కుటుంబంతో దీర్ఘకాలం సంబంధాలున్న వ్యక్తి తెలిపారు.

5జీ వ్యవస్థలో జియో ఫైబర్ కీలకం…

రిలయన్స్ జియో ఫైబర్ (Reliance Geo Fiber) ఆస్తులను మోనటైజ్ చేయాలని సంస్థ భావిస్తోంది. జియో ఫైబర్‌ తన ఫైబర్‌ ఆప్టిక్‌ ఆస్తులను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్)గా నిర్వహిస్తోంది. ఈ ఆస్తుల అమ్మకం కోసం సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌, మొయిలిస్‌ అండ్‌ కో, ఐసీఐసీఐ (icici) సెక్యూరిటీస్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లుగా రిలయన్స్‌ నియమించుకుంది. గతేడాది కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ (Brookfield Asset Management) ఆధ్వర్యంలోని కన్సార్టియం రిలయన్స్ సంస్థలో రూ. 25,215 కోట్ల పెట్టుబడులను పెట్టిన సంగతి తెలిసిందే.

కాగా, గతేడాది మార్చిలో రిలయన్స్ టెలికాం అనుబంధ సంస్థ జియో ఇన్ఫోకామ్ నుంచి జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను డీమెర్జ్ చేసింది. మార్కెట్ పరిణామాల ఆధారంగా భారత్‌లోని 5జీ వ్యవస్థ అభివృద్ధిలో జియో 5జీ నెట్‌వర్క్, జియో ఫైబర్ ఆస్తులు కీలక పాత్ర పోషించనున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో 5జీ నెట్‌వర్క్ అత్యాధునిక వైర్‌లెస్ సేవలను అందించే ప్రణాళికను జియో సంస్థ సిద్ధం చేస్తోంది.

50 కోట్ల కస్టమర్లే లక్ష్యం

జియో ఫైబర్ టూ ది హోమ్ సేవలను ఇప్పటికే 10 లక్షల మందికి చేరవేసినట్టు కంపెనీ తెలిపింది. రాబోయే ఐదేళ్ల కాలంలో మొత్తం 1600 నగరాల్లో 50 కోట్ల వినియోగదారులు, 5 కోట్ల ఇళ్లు, కోటిన్నర ఎంటర్‌ప్రైజెస్‌లకు హైస్పీడ్ ఫైబర్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల ఫైబర్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్టు, దీన్ని మరింతగా అభివృద్ధి చేసి 11 లక్షల కిలోమీటర్లకు విస్తరించాలని యోచిస్తోంది.

Tags:    

Similar News