దేశానికే మోడల్ 'సర్వేలు' గురుకులం
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ‘సర్వేలు’ గ్రామంలోని గురుకుల పాఠశాల దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. దేశంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇది. 1971వ సంవత్సరంలో నవంబర్ 23న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ఈ గురుకులాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పీవీ నరసింహారావు మానస పుత్రికగా పేరొందింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్వేలు గురుకులం ఏర్పాటై నేటితో 49 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50వ వసంతంలోకి అడుగిడుతున్న […]
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ‘సర్వేలు’ గ్రామంలోని గురుకుల పాఠశాల దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. దేశంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇది. 1971వ సంవత్సరంలో నవంబర్ 23న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ఈ గురుకులాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పీవీ నరసింహారావు మానస పుత్రికగా పేరొందింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్వేలు గురుకులం ఏర్పాటై నేటితో 49 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ‘దిశ’ ప్రత్యేక కథనం.
దిశ, మునుగోడు: ఈ గురుకుల పాఠశాలను సర్వేలులో ఏర్పాటు చేయడానికి కారణం భూదానోద్యమ నాయకుడు, సర్వేలు గ్రామవాసి మద్ది నారాయణరెడ్డి 44 ఎకరాల భూమిని దానంగా ఇవ్వటమే. మద్ది నారాయణరెడ్డి పశ్చిమ బెంగాల్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్‌చే నడపబడుతున్న శాంతినికేతన్‌ను సందర్శించారు. ఆ సమయంలో తమ ప్రాంతంలో కూడా ఇటువంటి పాఠశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే తలంపు వచ్చింది. వెంటనే ఆయన తన అభిప్రాయాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుకు తెలిపారు. 44 ఎకరాల భూమిని స్కూల్‌కు దానం చేశారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు సర్వేలు గురుకుల పాఠశాలను ప్రారంభించారు. అలా ఈ స్కూల్‌కు అంకురార్పణ జరిగింది.
దేశవిదేశాల్లో సెటిల్ అయిన పూర్వ విద్యార్థులు
1971 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కొన్ని వేల మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా దేశ, విదేశాలలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులుగా వెలుగొందుతున్నారు. ఈ పాఠశాలలో చదివి పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల్లో ఎంపికైనవారు పాఠశాల విద్యా బోధనకు గీటురాళ్లు.
అత్యుత్తమ విద్యాబోధన
ఇక్కడ ఉదయం నాలుగున్నర గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిరంతర విద్యాసాధన చేస్తుంటారు. ఇదే తమ అభ్యున్నతికి కారణమని ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు చెప్పుకుంటారు. నిరంతరం ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి తమ అనుమానాలను నివృత్తి చేయడంతోనే తాము ఈ ఫలితాలు సాధించగలిగామని వారు గర్వంగా చెబుతుంటారు.
అప్పట్లో అడ్మిషన్లు ఇలా..
ఈ పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కొరకు బ్లాక్, జిల్లా స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి 36 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించేవారు. 7వ తరగతి తుది పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి వారికి జిల్లా స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి 72 మందిని 8వ తరగతికి ఎంపిక చేసేవారు. 5వ తరగతిలో చేరిన వారు 36 మంది, 8వ తరగతిలో చేరిన వారు 72 మంది కలిపి మొత్తం 108 మంది విద్యార్థులు ప్రతి బ్యాచ్‌లో ఉండేవారు. ఈ గురుకుల పాఠశాల నుంచి తొలి ఎస్ఎస్‌సీ బ్యాచ్ 1974వ సంవత్సరంలో బయటకొచ్చింది.
పాఠశాల స్పెషాలిటీ
సర్వేలు గురుకుల పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చదివే విద్యార్థులకు సంస్కృతం ఒక సబ్జెక్టుగా బోధించడంతో చిన్ననాటి నుంచి నీతి, ధర్మం, ప్రేమ, న్యాయం, శాంతి మొదలైన సుగుణాలు ఏర్పడడానికి కారణమయ్యాయని ఈ పాఠశాలలో చదివిన విద్యా ర్థులు చెబుతుంటారు. దీన్ని స్ఫూర్తిగా తీసు కుని 1983లో అప్పటి రాష్ట్ర సీఎం ఎన్టీ రామా రావు జిల్లాకు రెండు చొప్పున (1 బాలి కలు,1 బాలురు) రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా సాంఘి క, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలను వందల సంఖ్యలో ఈ పాఠశాల స్ఫూర్తితోనే ఏర్పాటు చేయడానికి బీజం పడింది.
పాఠశాలలో చదివిన కొద్దిమంది ఆణిముత్యాలు
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం, తెలంగాణ గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, తెలంగాణ ఈస్ట్ జోన్ ఐజీ నాగిరెడ్డి, కమిషనర్ ల్యాండ్ రికార్డ్స్ శశిధర్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ డీజీఎం శాంతనంది ప్రసాద్, తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ మురళీధర్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డి.రమేష్, విశాఖ స్టీల్ డీజీఎం బీయువిఎన్ రాజు, బీహెచ్ఈఎల్ డీజీఎం స్వామి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంకా ఎంతోమంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వారు ఈ పాఠశాల విద్యార్థులే.
పూర్వ విద్యార్థుల విశిష్ట సేవలు
సర్వేలు గురుకుల పాఠశాలలో చదివిన వి ద్యార్థులు 1972వ సంవత్సరం నుంచి ఒక సంఘంగా ఏర్పడి నాటి నుంచి సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టర్ నరేందర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రమణారెడ్డిలు వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి రెండో ఆదివారం విధిగా ఈ సంఘం సమా వేశం అయ్యి హెల్త్ క్యాంపులు, కెరీర్ గైడెన్స్, హరితహారంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాము చదివిన పాఠశాల అభివృద్ధికి తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. 1997 ఫిబ్రవరి 10న పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల రజతోత్సవాలను నిర్వహించారు. ఈ నెల 23న 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఏడాదిపాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వర్ణోత్సవ వేడుకల చివరి రోజు రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని ఆహ్వానిస్తామని పూర్వ విద్యార్థుల సంఘం తెలిపింది.
నిరాడంబరంగా స్వర్ణోత్సవాలు
అట్టహాసంగా స్వర్ణోత్సవాలు నిర్వహించాలనే ఆలోచన ఉన్నా కరోనా నిబంధనలను అనుసరించి నిరాడంబరంగా నిర్వహిస్తాం. నేడు జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించి ఏడాది పాటు పాఠశాల విద్యార్థులచే క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగిస్తాం. కరోనా వైరస్ తగ్గుముఖం పడితే ఉత్సవాల చివరి రోజు రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని ఆహ్వానించి అట్టహాసంగా నిర్వహిస్తాం. -రాజశేఖర్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి, సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్