కరోనా దెబ్బతో చుక్కలు చూస్తున్న చిరువ్యాపారులు
నాది సంగారెడ్డి. బతుకు దెరువుకోసం వచ్చి కూరగాయాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. పొద్దుగాల నుంచి చీకటి పడేదాక కూరగాయలు అమ్మితే రూ.500 వచ్చేది. కరోనాతో ఇప్పుడు గిరాకీ బాగా తగ్గింది. ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నా.. ఇప్పుడు కూరగాయాలు అమ్మితే వచ్చే పైసలతో కిరాయికే సరిపోయేటట్టుంది. నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబం గడువడం కష్టంగా ఉంది. – రాములమ్మ, వెంకటగిరికాలనీ, జూబ్లీహిల్స్ ఉపాధికోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు వచ్చినా. గత కొన్నేళ్లుగా టీస్టాల్ పెట్టుకొని కుటుంబాన్ని […]
నాది సంగారెడ్డి. బతుకు దెరువుకోసం వచ్చి కూరగాయాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. పొద్దుగాల నుంచి చీకటి పడేదాక కూరగాయలు అమ్మితే రూ.500 వచ్చేది. కరోనాతో ఇప్పుడు గిరాకీ బాగా తగ్గింది. ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నా.. ఇప్పుడు కూరగాయాలు అమ్మితే వచ్చే పైసలతో కిరాయికే సరిపోయేటట్టుంది. నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబం గడువడం కష్టంగా ఉంది. – రాములమ్మ, వెంకటగిరికాలనీ, జూబ్లీహిల్స్
ఉపాధికోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు వచ్చినా. గత కొన్నేళ్లుగా టీస్టాల్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న. గతేడాది లాక్ డౌన్‌తో తీవ్ర ఇబ్బందులెదుర్కొన్న. ఇప్పడు నైట్ కర్ప్యూ విధించడంతో పాటు లాక్‌డౌన్ కూడా విధిస్తరని వస్తున్న వార్తలకు పనికోసం వచ్చిన వారంతా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో టీ తాగేందుకు ఎవరూ రావడం లేదు. కనీస కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. తిరిగి శ్రీకాకుళం వెళ్లిపోదామనుకుంటున్నా. – నారాయణరావు, యూసుఫ్‌గూడలో టీస్టాల్ నిర్వహకుడు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా దెబ్బతో చిరువ్యాపారులు చుక్కలు చూస్తున్నారు. వ్యాపారాలు డీలా పడిపోయి పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా భయంతో రోడ్ సైడ్ ఏదైనా కొనాలంటేనే జనం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి కూరగాయల వరకు ఏది కావాలన్నా సూపర్ మార్కెట్స్, ఆన్లైన్ వైపే మొగ్గుచూపుతున్నారు. దాంతో చిరు వ్యాపారాలకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. శానిటైజర్ వాడుతున్నా, మాస్కులు పెట్టుకుంటున్నా జనం పెద్దగా రావడం లేదని పలువురు వాపోతున్నారు. మరోపని చేసుకుందామనుకున్నా అది రాకపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో తగ్గిన సంచారం
కరోనా వైరస్ ప్రభావంతో నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించారు. ఒకవేళ తిరగాల్సి వచ్చినా మాస్కులు, కర్చీఫ్‌ల వంటివి ఉపయోగిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు శుచికి, శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బయటి ఆహారం తినేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో వీకెండ్స్‌తో పాటు ఇతర రోజుల్లోనూ హోటళ్లు, రెస్టారెంట్లు జనంతో కిటకిటలాడేవి. నగర వాసులు బయటి ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ ధోరణిలో మార్పు వచ్చింది. కరోనా భయాలతో ఇంటి ఫుడ్‌కే ప్రాధాన్యం ఇస్తుండటంతో నగరంలోని చిన్నా చితక టిఫిన్ సెంటర్లు గిరాకీలు లేక వెలవెలబోతున్నాయి. కరోనా కారణంగా తమ వ్యాపారం దెబ్బతిన్నదని చిన్న టిఫిన్ సెంటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పండ్ల వ్యాపారులపైన ప్రభావం
హోటళ్లు, టిఫిన్ సెంటర్లపైనే కాదు.. కరోనా ఎఫెక్ట్ పండ్ల వ్యాపారులపైనా పడింది. కరోనా భయంతో పండ్లు కొనేందుకు జనం భయటకు రావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఒక్క రోజులో అమ్మే పండ్లు 3 రోజులు అయినా అమ్ముడు పోవడం లేదని… పండ్లు పాడయిపోవడంతో తాము నష్టపోతున్నామని ఎర్రగడ్డ, కొత్తపేట, ఎంజే ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా ప్రభావం చిరువ్యాపారులను చిన్నాభిన్నం చేస్తోంది. వ్యాపారాలు లేక తమ బతుకుబండి నడిచేదే కష్టంగా మారింది. ఈ పరిస్థితి ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.