అధికారుల కనుసన్నల్లో అక్రమ దందా
వెనుకటికి తల్లి లేని బిడ్డకు కల్లే తల్లై సాకింది. బొడ్డు గురిగిలో కల్లు పోసి.. చంటిబిడ్డ నోట్లో పెడితే తల్లిపాల వలే తాగేది. కల్లు అంత స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. కల్లు సీసాల్లోకి అక్రమవ్యాపారుల కల్తీ కల్లు చేరింది. నిషేధిత మత్తు రసాయనాలను కలిపి కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఆ కల్లు తాగే జనం ఒళ్లంతా విషమే. ఒక్క పూట కల్లు లేకుంటే పిచ్చిపట్టి చచ్చిపోయే స్థాయికి దిగజారిపోయారు. కొంతకాలంగా జడ్చర్లలను […]
వెనుకటికి తల్లి లేని బిడ్డకు కల్లే తల్లై సాకింది. బొడ్డు గురిగిలో కల్లు పోసి.. చంటిబిడ్డ నోట్లో పెడితే తల్లిపాల వలే తాగేది. కల్లు అంత స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. కల్లు సీసాల్లోకి అక్రమవ్యాపారుల కల్తీ కల్లు చేరింది. నిషేధిత మత్తు రసాయనాలను కలిపి కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఆ కల్లు తాగే జనం ఒళ్లంతా విషమే. ఒక్క పూట కల్లు లేకుంటే పిచ్చిపట్టి చచ్చిపోయే స్థాయికి దిగజారిపోయారు. కొంతకాలంగా జడ్చర్లలను అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారులు చేస్తున్న దందా అంతాఇంతా కాదు. కాగా, కొంతమంది అవినీతి అధికారుల అండదండల కనుసన్నల్లో ‘కల్తీ’ దందా మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
దిశ, జడ్చర్ల: ఏళ్లకేళ్లుగా జనం అలవాటుతో వ్యాపారం చేస్తున్న గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న అక్రమ కల్లు మాఫియా తన విష కోరలతో కాటు వేస్తుంది. జడ్చర్లను అడ్డాగా చేసుకొని చీకటి వ్యాపారాన్ని విస్తరిస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. కల్తీకల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. కాలకూట విషం తయారు చేసి విక్రయిస్తున్నారు. కార్మికులు, కూలీల కడుపు కొడుతూ అడ్డంగా సంపాదిస్తున్నారు. వ్యాపారులు మత్తు కోసం ఇందులో నిషేధిత క్లోరో హైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలం వంటి ప్రాణాలు హరించే రసాయనాలు కలుపుతున్నారు. అంతే కాకుండా అమ్మోనియం మిశ్రమ రసాయనాలు, సోడా యాష్, కుంకుడుకాయ రసం వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కళ్లు పోవడం, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రావడం, ప్రాణాలు సైతం పోతున్న ఘటనలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిషేధిత భయంకర రసాయనాలను మోతాదుకు మించి కల్లు తయారు చేసి ప్రజలను బానిసలు చేసి లక్షలు గడిస్తున్నారు. కల్తీ కల్లు తాగిన ప్రజలు ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
ఇంత జరుగుతున్నా ప్రజల సంక్షేమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఎక్సైజ్ అధికారులు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కొంతమంది అధికారుల కనుసన్నల్లో మూడు పూలు ఆరు కాయలు కొనసాగుతుందని చెబుతున్నారు. జడ్చర్ల మండలంలోని ఆలూరులో కల్తీ కల్లు సేవించి రెండు నిండు ప్రాణాలు బలైన విషయం తెలిసిందే. సంబంధిత ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ చేయకపోవడంతోనే కల్తీకల్లు మరణాలు సంభవించాయని తెలుస్తుంది. కల్తీ కల్లు సేవించడం వల్ల వేలాది మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో రైతులు, కూలీలు పనులు ముగిశాక కల్లు తాగడం అలవాటు ఉన్నవారు తప్పకుండా ఈత, తాటి కల్లు తాగుతారు. అయితే చెట్లు లేక పోవడంతో కల్లు సహజంగా లభించడం లేదు. దీంతో ప్రాణాలను హరించే రసాయనాలతో తయారు చేస్తున్నారు. మోతాదుకు మించి వేస్తుండడంతో తాగిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నా అబ్కారీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మాముళ్లతో మమ..
అడపదడపా చేసే తనిఖీల్లో కూడా మామూళ్లు వసూలు చేసుకుని వెళ్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్చ ర్లలో నిత్యం ఇదే తంతు కొనసాగుతుందని ఆయా గ్రామాల ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. సరైన సమయంలో కల్తీ మాఫియా దందా పై ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే జడ్చర్ల కల్తీ కల్లు కాటుకు రెండు ప్రాణాలు పోయేవి కావని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.