భూ‘లిటికల్’ గేమ్.. అధికార పార్టీ నేతల భారీ స్కెచ్
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో భూలిటికల్ గేమ్ రక్తికడుతోంది. ల్యాండ్ పూలింగ్ నాటకాన్ని నేతలు, అధికారులు రక్తి కట్టిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్‌లో పరిధిలోని ఏనుమాముల, ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, మొగిలిచర్ల గ్రామాల్లో 5వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని కాకతీయ అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకం మేరకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ భూ సర్వే కొనసాగిస్తోంది. ల్యాండ్ పూలింగ్ మాటున పేద రైతుల పంట పొలాలను చెరబట్టేందుకు సిద్ధమవుతున్నారన్న విమర్శలున్నాయి. నేతల […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో భూలిటికల్ గేమ్ రక్తికడుతోంది. ల్యాండ్ పూలింగ్ నాటకాన్ని నేతలు, అధికారులు రక్తి కట్టిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్‌లో పరిధిలోని ఏనుమాముల, ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, మొగిలిచర్ల గ్రామాల్లో 5వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని కాకతీయ అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకం మేరకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ భూ సర్వే కొనసాగిస్తోంది. ల్యాండ్ పూలింగ్ మాటున పేద రైతుల పంట పొలాలను చెరబట్టేందుకు సిద్ధమవుతున్నారన్న విమర్శలున్నాయి.
నేతల భూముల విలువలను పెంచుకునేందుకు పేదల భూముల్లో అభివృద్ధి పనులు, వెంచర్లకు శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది కీలక ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు ఈ ఐదు గ్రామాల్లో వందల ఎకరాలను కొనుగోలు చేసినట్లుగా సమాచారం. పేదల భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, పూలింగ్ పద్ధతిన సేకరించడం అనే ద్విముఖ అక్రమ వ్యూహంతోనే భూలిటికల్ గేమ్ తెరపై నడుస్తోందని తెలుస్తోంది.
అంతా అధికారికంగా ఓ పద్ధతి ప్రకారం నడుస్తోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు నిబంధనలను పట్టించుకోకుండా భూ సర్వేను కొనసాగిస్తుండటం గమనార్హం. మా భూములు ఇవ్వబోము.. మాకిష్టం లేదని తెగేసి చెబుతున్నా వినిపించుకోవడం లేదు. భూ సర్వే ఆపివేయాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డేలో వరంగల్, హన్మకొండ కలెక్టర్లు హరిత, రాజీవ్‌గాంధీలకు రైతులు వినతిపత్రం అందజేశారు.
ల్యాండ్ పూలింగ్‌కు భూ సర్వే చేపట్టాలని తాము ఎవరిని ఆదేశించలేదని వరంగల్ కలెక్టర్ హరిత, హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు.. ఆరెపల్లి, పైడిపల్లి రైతులకు స్పష్టం చేయడం గమనార్హం. అసలు ఈ సర్వే ఎందుకు, ఎవరు చేపడుతున్నారు..? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారింది.
భూములను ముందే కొనేసుకున్న నేతలు..
ల్యాండ్ పూలింగ్ అంశం మేకవన్నె పులిలా ఉందని తెలుస్తోంది. పేదల భూములను పూలింగ్ చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు ఆ భూముల్లోనే జరిగేలా చూడటంతో ఆ పొరుగునే ఉండే తమ భూముల విలువలను అమాంతం పెంచుకునే భారీ కుట్రలు జరుగుతున్నాయని ఐదు గ్రామాలకు చెందిన రైతులు అనుమానిస్తున్నారు. గడిచిన కొద్ది నెలలుగా అధికార పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు, వారి అనుచరులు ఐదు గ్రామాల్లో భూ కొనుగోళ్లు భారీగా చేపట్టడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఓ నేత ఏకంగా గుట్టను అగ్గువ సగ్గువకు కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎకరం భూమి ధర రూ.3కోట్ల వరకు ఉండే ఆ ప్రాంతంలో గుట్ట స్థలాన్ని కేవలం రూ.5లక్షలకు… గుట్టను ఆనుకొని ఉన్న వ్యవసాయయోగ్యం కాని భూమిని ఎకరానికి రూ.15లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం 22 ఎకరాలపైనే ఈ భూమి ఉంటుందని ఆరెపల్లి రైతుల ద్వారా తెలుస్తోంది. మరో ప్రజాప్రతి తన అనుచరులతో 70 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
మరో ఇద్దరు కూడా ఇదే పద్ధతిలో భారీగా భూ కొనుగోళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అధికార పార్టీ నుంచి ఓరుగల్లు రాజకీయాల్లో కీలకంగా ఉన్న నలుగురు కీలక ప్రజాప్రతినిధులు భూ కొనుగోళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియకు అంతా కూడా ఆరెపల్లి, పైడిపల్లి గ్రామాలకు చెందిన కీలక ప్రజాప్రతినిధులకు అనుంగులైన స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు వ్యతిరేకిస్తున్నా సర్వే బృందానికి శాయశక్తులా సహకరిస్తుండటం గమనార్హం.
భూ సర్వే వద్దంటే వినరేం..!
తమ భూముల జోలికి రావొద్దు.. ల్యాండ్ సర్వే నిర్వహించొద్దంటూ రైతులు తెగేసి చెబుతున్నా.. వారిని బలవంతం చేస్తుండటం గమనార్హం. ఎకరాల భూమి తీసుకొని.. అభివృద్ధి చేసి భూమిని గజాల లెక్కన ఇచ్చే విధానం మాకు ఆమోదయోగ్యం కాదని, మా భూములు పోతే ఉపాధి పోతుంది, భరోసా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు మాత్రం బలవంతంగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటీసులు ఇవ్వకుండా, గ్రామ సభ నిర్వహించకుండానే అవగాహన ప్రిలిమినరీ సర్వే అని చెప్పి భూ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్‌లు, ఖాతా నెంబర్లు, సర్వే నెంబర్లు, ఫోన్ నెంబర్లు తీసుకెళ్లారని రైతులు చెబుతున్నారు. ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని రైతులకు చెప్పకుండానే ఆరెపల్లి, పైడిపల్లి గ్రామాల్లో దాదాపు 70శాతం రైతుల నుంచి వివరాలు తీసుకోవడం గమనార్హం.
నాలుగు రోజుల క్రితం పూలింగ్ కోసమే ఓ ప్రైవేటు ఏజెన్సీ ఆధ్వర్యంలో భూ సర్వే జరుగుతున్న విషయాన్ని నిర్దారించుకున్న రైతులు సేకరించిన రెవెన్యూ డేటా రికార్డులను బలవంతంగా గుంజుకున్నారు. గుంజుకున్న కొంతమంది రైతులపై హసన్‌పర్తి స్టేషన్‌లో కూడా అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ రికార్డులను తమకు అందజేయాలని రైతులపై కూడా అధికారులు ఒత్తిడి తీసుకు వస్తుండటం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.