మన్యంలో రగడ: అధికారులపై భగ్గుమన్న ఆదివాసీలు

దిశ, భద్రాచలం: మన్యంలో రెవెన్యూ తీరుపై ఆదివాసీలు భగ్గున మండిపడుతున్నారు. పెద్దోళ్లకి కొమ్ముకాస్తూ పేదలపైనే రెవెన్యూ యంత్రాంగం ప్రతాపం చూపుతోందని పేద ఆదివాసీలు ఆగ్రహిస్తున్నారు. సీపీఐ అండతో ఇళ్ల స్థలాల పోరాటం ఉధృతం చేస్తున్నారు. చర్ల మండలం ఎంపీపల్లి చెక్కులో సర్వేనంబర్ 46/1లో 2.83 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈనెల 22న నాలుగు గ్రామాల ఆదివాసీలు జెండాలు పెట్టి గుడిసెలు (డేరాలు) వేయగా, రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం అక్కడకు వెళ్లి ఇది ప్రభుత్వ స్థలం, ఆక్రమిస్తే శిక్షార్హులు […]

Update: 2021-03-26 15:00 GMT

దిశ, భద్రాచలం: మన్యంలో రెవెన్యూ తీరుపై ఆదివాసీలు భగ్గున మండిపడుతున్నారు. పెద్దోళ్లకి కొమ్ముకాస్తూ పేదలపైనే రెవెన్యూ యంత్రాంగం ప్రతాపం చూపుతోందని పేద ఆదివాసీలు ఆగ్రహిస్తున్నారు. సీపీఐ అండతో ఇళ్ల స్థలాల పోరాటం ఉధృతం చేస్తున్నారు. చర్ల మండలం ఎంపీపల్లి చెక్కులో సర్వేనంబర్ 46/1లో 2.83 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈనెల 22న నాలుగు గ్రామాల ఆదివాసీలు జెండాలు పెట్టి గుడిసెలు (డేరాలు) వేయగా, రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం అక్కడకు వెళ్లి ఇది ప్రభుత్వ స్థలం, ఆక్రమిస్తే శిక్షార్హులు అని బోర్డు పెట్టారు.

కాసేపటిలోనే పోలీసు, రెవెన్యూ అధికారులు వెళ్లి గిరిజనులతో చర్చించారు. అర్హులైతే పరిశీలించి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గుడిసెలు తొలగించి స్థలం ఖాళీచేసి వెళ్ళిపోవాలని చెప్పారు. అయినప్పటికీ తాము వేసిన గుడిసెలు తొలగించబోమని ఆదివాసీలు ఖరాకండిగా చెప్పడంతో రెవెన్యూ సిబ్బందే వాటిని తొలగించారు. రెవెన్యూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఆదివాసీలు అక్కడ నుంచి చర్లకు వెళ్లి సర్వే నంబర్ 117 ప్రభుత్వ భూమిలో (కాలేజీ దగ్గర గుట్టపై) ఎర్రజెండాలు పాతి మళ్లీ గుడిసెలు వేశారు.

అర్హులైన ఆదివాసీలకు ఇళ్ళస్థలాలు ఇవ్వాల్సిందే..!

అనేక ఏళ్లుగా ఈ భూమి గిరిజనేతర రైతు స్వాధీనంలో ఉన్నా (రికార్డులో అనుభవదారుగా) పట్టించుకోని అధికారులు పేద గిరిజనులు ఆక్రమిస్తే పరుగులు తీస్తూ రావడమేంటని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు పెట్టని బోర్డు ఇప్పుడు పెట్టడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లలాగా తాము ధనవంతులం, భూస్వాములం కాదని, ఇళ్ల స్థలాలులేక ఒక్కో ఇంటిలో రెండు, మూడు కుటుంబాలవారము ఇబ్బందులు పడుతూ నివశిస్తున్నామని 46/1లో గుడిసెలు వేసిన సీ.కత్తగూడెం, కొయ్యూరు, ఉప్పరిగూడెం, గన్నారం గ్రామాల ఆదివాసీలు తెలిపారు. అర్హులైన తమకు ప్రభుత్వ భూములు ఇండ్ల స్థలాలుగా పంపిణీ చేయమని చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.

తమ గోడు పట్టించుకోని రెవెన్యూ అధికారుల తీరుపై విసుగుచెంది సీపీఐ అండతో ఇళ్ల స్థలాల కోసం భూపోరాటం చేస్తున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. ఖరీదైన లంక భూములు, ప్రభుత్వ స్థలాలను ధనవంతులైన గిరిజనేతరులు ఆక్రమించి యథేచ్ఛగా సాగు చేస్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేద గిరిజనులు వేసిన గుడిసెల దగ్గరకు పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి ఖాళీ చేయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కొయ్యూరు, గన్నారం కాలనీ, లెనిన్ కాలనీ, ఆనంద్ కాలనీ, ఉప్పరిగూడెం, సింగసముద్రం గ్రామాల ఆదివాసీలు సీపీఐ ఆధ్వర్యంలో చర్లలో సాయి నగర్ గుట్టపై జెండాలు పెట్టి గుడిసెలు వేసి ఆక్రమించారు. ఇక్కడే ఇళ్లు కట్టుకొని నివాసం ఉంటాం. ఎవరొచ్చినా ఇక్కడి నుంచి కదిలేదిలేదని ఆదివాసీలు హెచ్చరిస్తున్నారు.

ఆక్రమిత భూములన్నీ స్వాధీనం చేసుకోవాలి..

చర్లలో గిరిజనేతర రైతులు ఆక్రమించిన ఖరీదైన లంకలు, ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కల్లూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 46/1లో పేదల గుడిసెలను అధికారులు తొలగించడం సరైందికాదన్నారు. ఈ భూమి పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని అవసరమైతే న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేదలకు సీపీఐ అండగా నిలుస్తుందని తెలిపారు. పేదలకు భూములు దక్కేవరకు వారి పక్షాన పోరాడుతామన్నారు. కబ్జాలు తొలగించి పేదలకు పంచాలనే డిమాండ్‌తో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News