కనిపించని నాలుగో సింహం.. రెవెన్యూ శాఖ !
– కరోనా కట్టడిలో అధికారుల తలమునకలు దిశ, హైదరాబాద్: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ప్రభావంతో బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే వేలాది మంది మృత్యువాత పడగా.. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలు బెటర్ అనే చెప్పొచ్చు. వాస్తవానికి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల అనంతరమే దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటన వెలుగులోకి రాకమునుపు తెలంగాణలో 50 […]
– కరోనా కట్టడిలో అధికారుల తలమునకలు
దిశ, హైదరాబాద్: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ప్రభావంతో బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే వేలాది మంది మృత్యువాత పడగా.. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలు బెటర్ అనే చెప్పొచ్చు. వాస్తవానికి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల అనంతరమే దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటన వెలుగులోకి రాకమునుపు తెలంగాణలో 50 లోపే ఉన్న పాజిటివ్ కేసులు ప్రస్తుతం 364కు చేరుకున్నాయి. నిజాముద్దీన్ ప్రార్థనలు హైదరాబాద్ నగరంపైనా తీవ్ర ప్రభావాన్నిచూపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంది. ఈ చర్యల్లో భాగంగా.. వైద్య బృందాలు, పోలీస్, మున్సిపల్ శాఖలతో పాటుగా నిరంతరం విధుల్లో భాగస్వామ్యమవుతూ తెరవెనుక కీలక పాత్రను పోషిస్తోంది రెవెన్యూ శాఖ.
క్వారంటైన్ కేంద్రాల నిర్వహణలో..
ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఎలాంటి మెడిసిన్ లేకపోవడంతో ముందస్తు జాగ్రత్తలే మేలంటోంది ప్రభుత్వం. అందుకే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి బంధువులు, స్నేహితులతో పాటు మొత్తం కాంటాక్ట్ జాబితాను సిద్ధం చేస్తోంది. వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు ఈ కేంద్రాలు దోహదం పడనున్నాయి. ఇతరులెవరినీ కలవకుండా, కేవలం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నందున వీరికి రోగ నిరోధక శక్తి పెరిగే వీలుంది. హైదరాబాద్ జిల్లాలో అమీర్‌పేట నేచర్ క్యూర్ ఆస్పత్రి, మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, ఓల్డ్ సిటీలోని నిజామియా ఆస్పత్రితో పాటు ఎంసీహెచ్ ఆర్డీ, షేక్ పేట నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలను హైదరాబాద్ కలెక్టర్ నేతృత్వంలో.. జిల్లాలోని పలువురు తహసీల్దార్లు సూపర్‌వైజ్ చేస్తున్నారు.
క్వారంటైన్ కేంద్రాల్లో 571 మంది..
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన 364 పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన వారే 133 మంది ఉండగా, 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో మరణించిన 11 మందిలో ఇద్దరు (2) నగరానికి చెందినవారే. ఇదిలా ఉండగా, ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన 1089 మందిలోనూ నగరానికి చెందినవారు 604 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో మొత్తం 616 మంది చేరగా, 45 మందికి పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌కు తరలించారు. మిగతా 571 మందిలో నేచర్ క్యూర్ ఆస్పత్రిలో 195 మంది, నిజామియా ఆస్పత్రిలో 249 మంది, సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో 127 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఇవి కాకుండా.. ముందస్తు జాగ్రత్తల నిమిత్తం ఎంసీహెచ్ ఆర్డీ, షేక్ పేట నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలను సైతం క్వారంటైన్ కేంద్రాలుగా ఉంచారు. కానీ, వీటిల్లో ఇంకెవరూ చేరలేదు. ఈ కేంద్రాలలో ఉంటున్న వారికి ఆహారంతో పాటు ఇతర వ్యక్తిగత అవసరాలు ఎప్పటికప్పుడు అందేలా తహసీల్దార్లు చర్యలు తీసుకుంటున్నారు.
లాక్ డౌన్ గడువు పొడిగింపు..
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల వ్యవహారం వెలుగు చూడక ముందు ఏప్రిల్ 7వ తేదీ నాటికల్లా తెలంగాణ కరోనా ఫ్రీగా మారుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో అత్యధికంగా నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వారు ఉండటంతో అనుమానితులకు క్వారంటైన్ గడువును మరికొంత కాలం పొడిగించాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగానూ లాక్ డౌన్ గడువు పెంచాల్సిన అవసరాన్ని ప్రభుత్వం నొక్కి చెబుతోంది. ఇప్పటికే వైరస్ సోకిన వారందరూ ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్నందున, గడువు పొడిగించడం మూలాన.. వైరస్ మరింత వ్యాపించేందుకు అవకాశం లేదంటోంది ప్రభుత్వం. క్వారంటైన్ టైంలో పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్‌కు తరలించే వీలుంటుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను అంచనా వేయడానికే లాక్ డౌన్‌ను మరికొంత కాలం పొడిగించాల్సి వస్తోందంటూ అధికారులు భావిస్తున్నారు.
Tags: Revenue Department, playing key role to control Corona, corona duty on revenue dept, telangana tahsildars, hyderabad collector