కేసీఆర్ కడుపులో విషం.. రేవంత్ సంచలన ఆరోపణ
దిశ, ఎల్బీనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం పోలీసుల లాఠీచార్జీలో గాయపడి ఎల్బీనగర్‌లో చికిత్స పొందుతున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ మనువడు రితీష్‌రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, శ్రీకాంతాచారి విగ్రహం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఓయూ విద్యార్థి బెల్లి కల్యాణ్, జడ్చర్ల మోహన్‌రావులను కాంగ్రెస్ నేతలు దామోదర రాజనరసింహా, […]
దిశ, ఎల్బీనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం పోలీసుల లాఠీచార్జీలో గాయపడి ఎల్బీనగర్‌లో చికిత్స పొందుతున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ మనువడు రితీష్‌రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, శ్రీకాంతాచారి విగ్రహం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఓయూ విద్యార్థి బెల్లి కల్యాణ్, జడ్చర్ల మోహన్‌రావులను కాంగ్రెస్ నేతలు దామోదర రాజనరసింహా, షబ్బీర్ అలీ, మల్లు రవి, మల్‌రెడ్డి రంగారెడ్డి, సుంకెపల్లి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్‌రెడ్డి రాంరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డిలతో కలిసి రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారులపై, నిరుద్యోగ యువతపై, అమరవీరుల కుటుంబాలపై, ప్రశ్నించే గొంతులపై దాడులు చేయిస్తూ తండ్రీ కొడుకులు పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. అమరుల త్యాగాల పునాదుల మీద అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ఖాళీల భర్తీ కోసం గాంధీ జయంతి రోజు ప్రశాంతంగా నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేసీఆర్ కడుపులో విషం ఉందని, అమరులను ఎవరైనా స్మరిస్తే ఉక్కపాదంతో అణిచివేస్తారని ఊహించలేదన్నారు. శ్రీకాంతాచారి విగ్రహానికి దండ వేయడానికి ప్రయత్నిస్తే మఫ్టీలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాపోయారు.
దుర్మర్గంగా పోలీసులు చేసిన దాడిలో అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులు గాయపడ్డారని ఈ విషయంపై ఎస్సీ, ఎస్సీ, మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. నిజాం కాలంలో రజాకార్ల మాదిరి కొంతమంది ముష్కరులను, అరాచక శక్తులను దగ్గర పెట్టుకుని తెలంగాణ ప్రజలపై దాడులు, నిర్బంధాలు చేయించి కేసీఆర్, కేటీఆర్‌లు పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు త్వరలోనే తండ్రీకొడుకులను బొందపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గాయపరిచి హుజూరాబాద్ ప్రచారంలో లేకుండా చేయాలని టీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి టీఆర్ఎస్, బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు టీవీల్లో తిట్టుకుంటారు, బంగ్లాల్లో కలిసుకుంటారని విమర్శించారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తెలిపారు. విద్యార్థి నిరుద్యోగుల ‘జంగ్ సైరన్’ మలిదశ పోరు పాలమూరులో ఉంటుందని అక్కడ తేల్చుకుందామని కేసీఆర్, కేటీఆర్‌లకు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.