'ఉపాధి' బాధ్యతలు ఇకపై పంచాయతీ కార్యదర్శులకు..!

దిశ, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం( ఎం. జి. ఎన్.ఆర్.ఇ.జి.ఎ) లో క్షేత్ర  స్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది. ఇప్పటికే వారిని పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా ఆ బాధ్యతలను గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నిర్వహించేలా సర్క్యూలర్ ను జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు వీధిన పడ్డట్లేనని స్పష్టమవుతోన్నది. సుమారు 15 సంవత్సరాలకు పైగా ఈజీఎస్ […]

Update: 2020-04-30 01:34 GMT

దిశ, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం( ఎం. జి. ఎన్.ఆర్.ఇ.జి.ఎ) లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది. ఇప్పటికే వారిని పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా ఆ బాధ్యతలను గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నిర్వహించేలా సర్క్యూలర్ ను జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు వీధిన పడ్డట్లేనని స్పష్టమవుతోన్నది. సుమారు 15 సంవత్సరాలకు పైగా ఈజీఎస్ లో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు తమను తొలగించవద్దని భిన్న రకాల ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం వారిని తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. ఎట్టకేలకు వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది.

ఏడు వేలకు పైగా కుటుంబాలు..

ఈజీఎస్ లో క్షేత్రస్థాయి సహాయకుల తొలగింపునకు నిర్ణయం తీసుకుని ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడం ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోన్నది. నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలకు గాను 370 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. కాగా 222 మంది మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరినీ తొలగించి పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేశారని అంచనా. వీరికి నెలకు వారి పనితీరును బట్టి ఏడున్నర వేల నుంచి 10 వేల జీతం ఇచ్చేవారు తాజా పరిణామంతో ఈ కుటుంబాలకు తీరని నిరాశ మిగిలింది. అందులోనూ కరోనా సమయంలో ఎలాంటి జీతభత్యాలు లేకుండా బతకడం అంటే ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు రోడ్డున పడ్డట్లే.

అవినీతి అక్రమాలే సాకుగా…

ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడానికి అవినీతి అక్రమాలే ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో ప్రతిసారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయని, అలాగే అక్రమ జాబ్ కార్డులు, చేయని పనులను చేసినట్లుగా రికార్డు చేయడం వంటి అనేక కారణాలు ఈ వ్యవస్థను తొలగించడానికి కారణం అని తెలుస్తోన్నది. ప్రతిసారి జరిగే సోషల్ ఆడిట్లో ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమాలు వెలుగు చూస్తుండడం, వారిని విధుల్లో నుంచి తొలగించడం జరుగుతున్నాయి. అయితే అక్రమ మార్గంలో నష్టపోయిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయడం పది శాతానికి మించడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంపై భయం లేకుండా పోవడం, జవాబుదారితనం లేకపోవడం కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఉపాధి హామీ శాఖ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం వారిని పక్కన పెట్టి కొత్తగా విధుల్లోకి తీసుకున్న పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోన్నది. అయితే కొందరు అక్రమాలకు పాల్పడితే దాన్ని సాకుగా చూపి అందరినీ విధుల్లో నుంచి తొలగించడం బాధాకరమని మిగతా ఫీల్డ్ అసిస్టెంట్లు అభిప్రాయపడుతున్నారు.

పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు…

ఉపాధి హామీ పథకంలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు కట్టబెడుతూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఉత్తర్వులు నెంబర్ 4779 తేదీ 27. 04. 2020 ప్రకారం… ఇకపై ఉపాధిహామీ బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులు చూడనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావ్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవో లు, జెడ్పీ సీఈవో లకు, మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

“దిశ” మార్చి 13 నే చెప్పింది…

ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థకు మంగళం పాడుతున్నట్లు, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు కూడా మొదలుపెట్టినట్లు మార్చి నెల 13వ తేదీన “దిశ” దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే కరోనా రావడంతో ధర్నా కార్యక్రమాలను ఫీల్డ్ అసిస్టెంట్లు మానుకున్నారు. తాజాగా “దిశ” చెప్పినట్లుగానే క్షేత్ర బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Tags: mgnregs, field assistant, removal, irregularities, bio-issuance, directional narrative

Tags:    

Similar News