పరిశ్రమ వృద్ధిపై స్పష్టత ఉండకపోవచ్చు
దిశ, వెబ్‌డెస్క్: గత రెండు నెలలుగా ఆటో అమ్మకాలు కోలుకుంటున్న సంకేతాలు కనబడటం స్థిరమైన వృద్ధి కాదని, ఈ రంగం ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నందున వచ్చే ఏడాదిలో పరిశ్రమ ఎలా ఉంటుందనే దానిపై పరిశ్రమ వర్గాల్లో సందేహాలున్నాయని ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమైన తర్వాత జూన్ నుంచి ఆటో అమ్మకాలు క్రమంగా పెరిగాయి. సెప్టెంబర్‌లో పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు మరింత […]
దిశ, వెబ్‌డెస్క్: గత రెండు నెలలుగా ఆటో అమ్మకాలు కోలుకుంటున్న సంకేతాలు కనబడటం స్థిరమైన వృద్ధి కాదని, ఈ రంగం ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నందున వచ్చే ఏడాదిలో పరిశ్రమ ఎలా ఉంటుందనే దానిపై పరిశ్రమ వర్గాల్లో సందేహాలున్నాయని ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమైన తర్వాత జూన్ నుంచి ఆటో అమ్మకాలు క్రమంగా పెరిగాయి. సెప్టెంబర్‌లో పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి.
అయితే, దీన్ని స్థిరమైన రికవరీగా భావించవద్దని, అనూహ్య డిమాండ్ నేపథ్యంలో, ప్రజా రవాణాకు ఆసక్తి చూపని ప్రజలు ప్రైవేట్ రవాణాకు మారడంతో ఈ అమ్మకాలు నమోదవుతున్నాయని రాజీవ్ తెలిపారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు విక్రయాలు బాగానే ఉంటాయి. అయితే, పూర్తి సంవత్సరానికి పరిశ్రమ మొత్తం అమ్మకాలు 23-25 శాతం క్షీణించవచ్చు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి పరిశ్రమ వృద్ధి ఉండనుంది. కరోనా వ్యాక్సిన్, ప్రభుత్వ రెండో ఉద్దీపన ప్రకటన తదితర పరిణామాలు ఆటో పరిశ్రమపై ప్రభావం చూపించనున్నట్టు రాజీవ్ వెల్లడించారు.
తమ అంచనా ప్రకారం..జనవరి నుంచి పరిశ్రమ అసలైన వృద్ధి నమోదయ్యే అవకాశమున్నట్టు పేర్కొన్నారు. టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, కియా మోటార్స్ ఇండియా సంస్థలు తమ సెప్టెంబర్ అమ్మకాలలో బలమైన అమ్మకాల వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి సంస్థల అమ్మకాలు క్షీణించగా, డిమాండ్ పెరుగుతోందని, డీలర్లపై చాలా ఎక్కువ విశ్వాసం ఉందని చెప్పారు. పండుగ సీజన్‌లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇదే స్థాయి అమ్మకాలు కొనసాగే అవకాశాలున్నట్టు కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇక, ఎంజీ మోటార్ ఇండియా గురించి స్పందిస్తూ..లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న క్రమంలో కంపెనీ సాధారణ స్థితికి చేరుకుంటుందని రాజీవ్ చాబా ఆశాభావం వ్యక్తం చేశారు.