టీఆర్ఎస్‌కు రెబల్ గుబులు.. నామినేషన్లు షురూ
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీకి రెబల్ గుబులు పట్టుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్‌లో ఇండిపెండెంట్లు నామినేషన్ వేయగా… చివరి రోజు పలువురు ఎంపీటీసీలు నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం ముందుంచిన 34 డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి పెంచేందుకే పోటీకి దిగుతున్నట్లు ఎంపీటీసీల సంఘం సభ్యులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీకి రెబల్ గుబులు పట్టుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్‌లో ఇండిపెండెంట్లు నామినేషన్ వేయగా… చివరి రోజు పలువురు ఎంపీటీసీలు నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం ముందుంచిన 34 డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి పెంచేందుకే పోటీకి దిగుతున్నట్లు ఎంపీటీసీల సంఘం సభ్యులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లకు ఈ నెల 23 చివరి తేదీ కావడంతో ప్రభుత్వం నుంచి వారి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ రాలేదు. ప్రభుత్వం ముందుంచిన 34 డిమాండ్లలో ప్రధానంగా 6 డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి పెంచారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి సమస్యలను విన్నవించారు. అయితే సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని ఎంపీటీసీలు హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహించుకున్నారు. భవిష్యత్ కార్యాచరణను సైతం రూపొందించుకున్నారు.
ఎంపీటీసీల రాష్ట్రం ఫోరంను పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవడంతో మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు కొన్ని జిల్లాల్లో నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నామినేషన్లకు చివరి తేదీ కావడంతో నామినేషన్లు పలు జిల్లాల్లో వేసేందుకు ఎంపీటీసీలు నామినేషన్ పత్రాలను సైతం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 20న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించిన సంఘం నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే 8 మంది సభ్యులు నామినేషన్లను మంగళవారం వేయనున్నారు. అదే విధంగా పలు జిల్లాల్లో సైతం నామినేషన్లు వేయనున్నట్లు ఎంపీటీసీల సంఘం సభ్యులు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవే…
1. ఎంపీటీసీలకు ప్రతి ఏటా రూ.20లక్షల నిధులు కేటాయించాలి
2. ప్రతి గ్రామపంచాయతీలో క్యాబిన్ ఏర్పాటు
3. ఆగస్టు 15న ప్రాథమిక పాఠశాలల్లో జెండా ఎగురవేసే అవకాశం ఇవ్వాలి
4. గౌరవ వేతనం రూ.15వేలు ఇవ్వాలి
5. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాలు కేటాయించాలి
6. ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో(ఎంపీటీసీలు, జడ్పీటీసీలు) అవకాశం కల్పించాలి.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఎంపీటీసీల సమస్యల పరిష్కారమే లక్ష్యం. గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎంపీటీసీలను చిన్నచూపు చూస్తోంది. ఎంపీటీసీలుగా చెలామని అవుతున్నా తమకు కనీస గౌరవం లేదు. గ్రామపంచాయతీల్లో కూర్చుందామన్న కుర్చీలేదు. పాఠశాలల్లో జెండా ఎగురవేసే అధికారం లేదు. ప్రజలు సమస్యలు పరిష్కరిస్తామని కోరితే ఏం చేయాలో అర్ధం కావడం లేదు. కనీసం ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కూడా లేవు. ఎలాంటి అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నాం. 34 సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించారు. కానీ అధికారికంగా జీవోలు విడుదల కాకపోవడంతో ఒత్తిడిపెంచేందుకు బరిలో దిగాలని భావించాం. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీలు నామినేషన్లు వేస్తారు.
– పల్లె వెంకన్న, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఎంపీటీసీల సంఘం
రేపు నామినేషన్లు వేస్తున్నాం
ఏ ప్రభుత్వం ఎంపీటీసీలకు తగిన గుర్తింపును ఇవ్వడం లేదు. సమస్యల పరిష్కారానికి ఒక్కటే మార్గమని భావించి పార్టీలకు అతీతంగా పోటీకి సన్నద్ధమవుతున్నాం. అందులో భాగంగానే ఈ నెల 23న నల్లగొండ జిల్లాలో 8 మంది నామినేషన్లు వేయాలని ఎంపీటీసీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మేరకు నామినేషన్లు వేస్తున్నాం. మాకు రాజకీయాలు అక్కర్లేదు. కేవలం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యలను పరిష్కరించుకోవడమే తమలక్ష్యం.
-ఏర్పుల శ్రీశైలం, ఎంపీటీసీల సంఘం నల్లగొండ జిల్లా ఆర్గనైజర్