జనసేనానికి నో ఎంట్రీ.. బీజేపీ ఆంతర్యమేంటి?
దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో జనసేన పోటీ చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బరిలో దిగాలని భావించిన జనసైనికులకు అప్పుడు నిరాశే మిగిలింది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బరిలోకి దిగుదాం అని తమ నాయకుడు ఇచ్చిన ప్రకటనతో జనసేన నాయకులు ఎగిరి గంతేశారు. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఎనలేని ఉత్సాహంతో నామినేషన్లు కూడా వేశారు. కానీ మరోసారి జనసేన నేతలు ఢీలా పడాల్సి వచ్చింది. […]
దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో జనసేన పోటీ చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బరిలో దిగాలని భావించిన జనసైనికులకు అప్పుడు నిరాశే మిగిలింది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బరిలోకి దిగుదాం అని తమ నాయకుడు ఇచ్చిన ప్రకటనతో జనసేన నాయకులు ఎగిరి గంతేశారు. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఎనలేని ఉత్సాహంతో నామినేషన్లు కూడా వేశారు. కానీ మరోసారి జనసేన నేతలు ఢీలా పడాల్సి వచ్చింది. అనూహ్యంగా పవన్ యు టర్న్ తీసుకున్నారు. జనసేన పోటీ చేయట్లేదని, తమ మద్దతు బీజేపీకేనని ప్రకటించారు.
కాగా మద్దతు పలికిన అనంతరం ఆయన ఆకస్మికంగా ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీ పెద్దల్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 3 రోజుల నుండి రాజధానిలో పడిగాపులు కాస్తున్నా… ఆయనకి అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ అంశంపై ఉభయ రాష్ట్రాల్లో హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి. జనసేనాని హస్తిన టూర్ వెనుక రహస్యం ఏంటి? ఏం ఆశించి ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవాలనుకుంటున్నారు? గ్రేటర్ లో మద్దతు పలికినా… పవన్ కోసం బీజేపీ గేట్లు ఎందుకు తెరవడం లేదు? తిరుపతి టికెట్ పై క్లారిటీ కోసమే పవన్ ఢిల్లీ వెళ్ళారా? మీరు ఆగండి, మేము పోటీ చేస్తాం అని చెప్పేందుకే వెళ్ళారా? ఇలా రకరకాల ఊహాగానాలతో చర్చలు సాగుతున్నాయి.
తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉపఎన్నికను అధికారపార్టీ తోపాటు టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ టీడీపీ గెలిస్తే వైసీపీపై జనాల్లో వ్యతిరేకత మొదలైందని, ప్రజలు తిరుగుబాటు మొదలెట్టారని ప్రూవ్ చేసుకునేందుకు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇక దుబ్బాకలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో తెలంగాణ బీజేపీ నేతలు మరింత దూకుడు పెంచారు. దీంతో ఏపీ టీడీపీ నేతలపై అధిష్టానం నుండి ఒత్తిడి మొదలైంది. ఈ క్రమంలో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించి బీజేపీ పెద్దల దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు లోకల్ లోటస్ నేతలు.
ఇక మనమేం తక్కువ తిన్నాం? మన పార్టీ నుండి అభ్యర్థిని నిలబెడితే గెలిపించి తీరుతాం. తెలంగాణ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే సైలెంట్ అయ్యాము కానీ ఏపీలో ఎవరికీ మద్దతు ఇవ్వడానికి వీల్లేదని, సొంతగా పోటీ చేయాల్సిందేనంటున్నారట పార్టీ లీడర్లు. ఎలాగైనా ఉపఎన్నికకు బరిలో దిగాలని భీష్మించుకు కూర్చున్నారట జనసైనికులు. దీనిపై ఆలోచించిన జనసేనాని… తిరుపతిలో పోటీకి బలాలేంటి? బలహీనతలేంటి అని పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. “తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయినప్పటికీ, ఆ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం బలంగా ఉంది. క్రియాశీలక ఓట్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు బీజేపీ పోటీ చేయకుండా జనసేనకు మద్దతు పలికితే గెలుపు ఖాయమని పవన్ కి ముఖ్యనేతలు తేల్చి చెప్పినట్టు సమాచారం.
అందునా ప్రజారాజ్యం పార్టీ నుండి 2009 ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు స్థానాల్లో పోటీ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ ఎన్నికల్లో తమ సామాజికవర్గం మరింత బలంగా ఉన్న పాలకొల్లు ఓటమి చవిచూసినప్పటికీ తిరుపతి ఓటర్లు మాత్రం చిరు పరువు నిలబెట్టారు. ఈసారి బీజేపీ మద్దతుతో జనసేన తిరుపతి బరిలో దిగితే గెలుపు ఛాన్సెస్ ఎక్కువ అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకునే బీజేపీ పెద్దలతో చర్చలు జరిపేందుకు పవన్ హస్తిన వెళ్లారని టాక్. దుబ్బాక విజయంతో కాంగ్రెస్ ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లోకి వెళ్లిపోయాం అనుకుంటున్న బీజేపీ, ఏపీలో కూడా అదే స్ట్రాటజీ అమలు చేసే ఆలోచనల్లో పడింది. పవన్ రాక వెనక ఆంతర్యం ముందే గ్రహించి అపాయింట్మెంట్ ఇవ్వడానికి సంశయిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ జనసేనాని మాత్రం తాడో పేడో తేల్చుకునే తిరిగి రావాలని ఫిక్స్ అయినట్టు ముఖ్య వర్గాల సమాచారం. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీ (టీడీపీ, బీజేపీ కూటమికి) రెండుచోట్లా బీజేపీకే మద్దతు తెలిపింది జనసేన. ఇక 2014, 2019 తెలంగాణ జిహెచ్ఎంసి ఎన్నికల్లో సైతం బీజేపీకే సంపూర్ణ మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఎప్పుడూ ఇవ్వడమే కానీ బీజేపీ నుండి తిరిగి మద్దతు పొందలేదు పవన్ పార్టీ. కానీ తిరుపతిలో జరగనున్న లోక్ సభ ఉపఎన్నికలో మాత్రం బీజేపీ నుండి తిరిగి తీసుకోవాలని భావిస్తున్నారట జనసేన. ఏం జరుగుతుందో తెలియాలంటే పవన్ ఢిల్లీ నుండి వాపసు రావాల్సిందే..!