రాజ్యసభలో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ : పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజునే రాజ్యసభలో చర్చ క్లిష్టంగా మారింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన సమావేశం పలుసార్లు వాయిదా పడింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు చమురు ధరల పెరుగుదలపై నిరసనలు చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలిగా మహిళా ఎంపీలు మాట్లాడారు. సభలో 50శాతం మంది మహిళా ప్రతినిధులుండాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సామాన్యులు చమురు […]
న్యూఢిల్లీ : పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజునే రాజ్యసభలో చర్చ క్లిష్టంగా మారింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన సమావేశం పలుసార్లు వాయిదా పడింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు చమురు ధరల పెరుగుదలపై నిరసనలు చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలిగా మహిళా ఎంపీలు మాట్లాడారు. సభలో 50శాతం మంది మహిళా ప్రతినిధులుండాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సామాన్యులు చమురు ధరలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లీటర్ పెట్రోల ధర సుమారు రూ. 100కు, లీటర్ డీజిల్ ధర రూ. 80కు చేరువయ్యాయని, వంట చెరుకు గ్యాస్ బండ ధర భారమైందని కాంగ్రెస్ రాజ్యసభ పక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. ఎక్సైజ్ డ్యూటీలు, సెస్‌లతో రూ. 21 లక్షల కోట్లను కేంద్రం ప్రజల నుంచి వసూలు చేస్తున్నదని, రైతులు సహా యావత్ దేశ ప్రజలందరూ కష్టాలనెదుర్కొంటున్నారని తెలిపారు. విపక్షాల ఆందోళన, నిరసన నినాదాలతో మార్మోగడంతో సభ సజావుగా సాగడానికి తోడ్పడాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సూచించారు. కానీ, ప్రతిపక్ష నేతలు నిరసన విరమించకపోవడంతో సభను వాయిదా వేశారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన సమావేశం పదింటికి తొలిసారిగా వాయిదా పడింది. ఉదయం 11 గంటల తర్వాత మళ్లీ ప్రారంభమైన సమావేశం సుమారు 20 నిమిషాల తర్వాత మరోసారి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా పడింది. అనంతరం 1.15 గంటలకు, తర్వాత 1.30 గంటలకు వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాల్సిందిగా టీఎంసీ నేతలు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లకు లేఖ రాశారు.
రాజ్యసభ టైమింగ్‌లో మార్పులు
రాజ్యసభ సమావేశ సమయంలో మార్పులు చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతల విజ్ఞప్తి మేరకు మంగళవారం నుంచి రాజ్యసభ సమావేశ సమయాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ చైర్ ఎంపీ వందన చవాన్ వివరించారు. మంగళవారం నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వివరించారు.