కో ‘పైలట్’ ఔట్

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాజకీయం మంగళవారం కీలకమలుపులు తిరిగింది. సీఎం గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ శిబిరాలతోపాటు బీజేపీ కూడా సోమవారం క్రియాశీలంగా కనిపించాయి. సోమవారమంతా సచిన్ కోసం పడిగాపులు కాసిన కాంగ్రెస్ మంగళవారం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ విప్‌ను రెండోసారి ఉల్లంఘించిన సచిన్ పైలట్‌పై వేటు వేసింది. డిప్యూటీ సీఎం సీటు నుంచి వైదొలిగించింది. అలాగే, ఆరేళ్లుగా కొనసాగుతున్న రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ పదవి నుంచీ తొలగించింది. సచిన్‌తోపాటు అతనికి మద్దతునిస్తున్న ఇద్దరు క్యాబినెట్ మంత్రులకూ ఉద్వాసన […]

Update: 2020-07-14 11:07 GMT

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాజకీయం మంగళవారం కీలకమలుపులు తిరిగింది. సీఎం గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ శిబిరాలతోపాటు బీజేపీ కూడా సోమవారం క్రియాశీలంగా కనిపించాయి. సోమవారమంతా సచిన్ కోసం పడిగాపులు కాసిన కాంగ్రెస్ మంగళవారం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ విప్‌ను రెండోసారి ఉల్లంఘించిన సచిన్ పైలట్‌పై వేటు వేసింది. డిప్యూటీ సీఎం సీటు నుంచి వైదొలిగించింది. అలాగే, ఆరేళ్లుగా కొనసాగుతున్న రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ పదవి నుంచీ తొలగించింది. సచిన్‌తోపాటు అతనికి మద్దతునిస్తున్న ఇద్దరు క్యాబినెట్ మంత్రులకూ ఉద్వాసన పలికింది. ఈ ప్రకటనల తర్వాత సచిన్ పైలట్ తన ట్విట్టర్ బయోను మార్చుకున్నారు. తనపై వేటుకు ప్రతిస్పందనగా, సత్యాన్ని పరేషాన్ చేయవచ్చునేమో కానీ, ఓడించలేరని ట్వీట్ చేశారు. సచిన్ మద్దతుదారులు గెహ్లాట్ సర్కారుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, బీజేపీ తొలిసారిగా గెహ్లాట్ సర్కారు అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించడానికి బీజేపీ రాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ సతీష్ పునియా నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు.

సచిన్ రెబల్‌గా మారిన తర్వాత సోమవారం శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించి గెహ్లాట్‌కు వందపైనే ఎమ్మెల్యేల మద్దతున్నదని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం వారందరినీ జైపూర్‌లోని ఫెయిర్‌మోంట్ హోటల్‌కు బస్సులో తరలించారు. ఈ హోటల్‌లో తమ కార్ కీ తీసుకున్నారని, ఇవ్వడం లేదని, హోటల్‌లో నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసులు స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని అన్నారు. ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెహ్లాట్ సర్కారుకు మద్దతునిచ్చారు. అయితే, అసెంబ్లీలో బలనిరూపణ జరిగితే మాత్రం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండాలని బీటీపీ నోటీసులు జారీ చేసింది. కాగా, సచిన్ పైలట్ తిరిగివచ్చేయాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ మంగళవారం మరోసారి సీఎల్పీ భేటీ నిర్వహించగా, రెండోసారి కూడా అతను గైర్హాజరయ్యాడు. ఈ భేటీ తర్వాతే కాంగ్రెస్ అతనిపై వేటు వేసింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌ మనేసర్ హోటల్‌లో 16మంది సచిన్ మద్దతుదారులు బస చేసినట్టు సోమవారం రాత్రి ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే.

సీఎల్పీ భేటీలో కీలక నిర్ణయాలు:

రెండో సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ భేటీ తర్వాత సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎంగా తొలగించాల్సి వస్తున్నదని కాంగ్రెస్ దూత రణదీప్ సుర్జేవాలా ప్రకటించారు. సర్కారును కూల్చే కుట్రలో భాగమవుతున్నందన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. అనంతరం పీసీసీ ప్రెసిడెంట్ సచిన్‌ను తొలగించిన తర్వాత ఆ స్థానంలో విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతాసరను కాంగ్రెస్ నియమించింది. కాగా, సచిన్‌ వర్గీయులు విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను క్యాబినెట్ నుంచి తొలిగించింది. అలాగే, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సచిన్ అనుయాయుడు ముకేష్ బాకర్‌ను తొలగించి గణేష్ గోగ్రాను నియమించింది. గెహ్లాట్‌కు మద్దతునివ్వడమంటే బానిసత్వాన్ని అంగీకరించినట్టేనని ఆయన క్రితం రోజు ట్వీట్ చేశారు.

గవర్నర్‌తో సీఎం భేటీ

ప్రస్తుత పరిస్థితులను గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు సీఎం అశోక్ గెహ్లాట్ వివరించారు. డిప్యూటీ సీఎంగా సచిన్‌ను తొలగిస్తున్నట్టు తెలపగా గవర్నర్ అందుకు అంగీకరించారని తెలిసింది. బీజేపీతో సచిన్ పైలట్ కలిసి తన సర్కారును కూల్చే యత్నం చేస్తున్నాడని గవర్నర్‌కు సీఎం తెలిపారు. సచిన్‌కు వీలైనన్ని అవకాశాలిచ్చామని, సోమ, మంగళవారాల్లో నిర్వహించిన సీఎల్పీ సమావేశాలకు రావాలని ఆహ్వానించామని వివరించారు. కానీ, అతను రాలేదని, అందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సచిన్ పైలట్ చేతిలో ఏమీ లేదని, ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమేనని ఆరోపించారు.

సచిన్ వెళ్లిపోవడం బాధాకరం: కాంగ్రెస్ నేతలు

సచిన్ పైలట్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లీడర్ శశిధరూర్ తన ట్విట్టర్‌లో సచిన్ వెళ్లిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సచిన్‌ను తమ బెస్ట్ యువనేతగా భావించారని, పార్టీ నుంచి వేరుపడటం కంటే కలిసి మరింత అభివృద్ధి చేస్తే బాగుండేదని తెలిపారు. సచిన్ పైలట్‌లాంటి దృఢమైన, ఉజ్వలమైన నేత పార్టీ వీడటం దురదృష్టకరమని మాజీ ఎంపీ ప్రియ దత్ వ్యాఖ్యానించారు. జ్యోతిరాదిత్య, సచిన్‌లు వెళ్లిపోవడంతో పార్టీ ఇద్దరు బలమైన యువనేతలను కోల్పోయిందని వివరించారు. పార్టీలో అంతర్గతంగా అతన్ని అవమానానికి గురిచేశారని తెలుస్తున్నదని, అందుకే ఆయన కాంగ్రెస్ వీడేందుకు నిర్ణయించుకున్నారని బీజేపీ నేత ఉమాభారతి అన్నారు. వాళ్ల కుటుంబం ఆత్మగౌరవానికి ప్రాణాలిస్తుందని, కాంగ్రెస్‌లో ఏడాదిన్నరగా సచిన్ అవమానాలకు గురయ్యారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలిపారు.

Tags:    

Similar News