ఎన్నికలు వస్తే చాలు.. తలుపు కొడుతున్నారు.. ఎవరంటే..?
న్యూఢిల్లీ : దేశంలో నాలుగు రాష్ట్రాల, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరు మరోసారి చర్చనీయాంశమైంది. గడిచిన కొద్దిరోజులుగా బెంగాల్, తమిళనాడు, కేరళలో పలువురు రాజకీయ నాయకుల (బీజేపీ కాకుండా ఇతర ప్రతిపక్షాలు) ఇండ్లల్లో సోదాల పేరిట ఏదో ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ వారి తలుపు తడుతున్నది. ఎన్నికలు ఉన్నాయంటే చాలు.. ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ […]
న్యూఢిల్లీ : దేశంలో నాలుగు రాష్ట్రాల, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరు మరోసారి చర్చనీయాంశమైంది. గడిచిన కొద్దిరోజులుగా బెంగాల్, తమిళనాడు, కేరళలో పలువురు రాజకీయ నాయకుల (బీజేపీ కాకుండా ఇతర ప్రతిపక్షాలు) ఇండ్లల్లో సోదాల పేరిట ఏదో ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ వారి తలుపు తడుతున్నది. ఎన్నికలు ఉన్నాయంటే చాలు.. ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) లు ప్రతిపక్ష నాయకుల ఇండ్లల్లోకి పరుగులు పెడుతున్నాయి.
ఇటీవల తమిళనాడులో ద్రావిడ మున్నెట్ర కజగం (డీఎంకే) అధినేత స్టాలిన్ అల్లుడు శబరీషన్ ఇంట్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక బెంగాల్‌లో అయితే గత నాలుగు నెలలుగా పలువురు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుల ఇండ్ల మీద తరుచూ పై సంస్థల దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి స్వతంత్ర ఏజెన్సీలుగా పేరున్న ఈ సంస్థలు దాడులు నిజంగా నిష్పక్షపాతంగానే జరుగుతున్నాయా..? విపక్ష నాయకులు ఆరోపిస్తున్నట్టు దీని వెనుక బీజేపీ హస్తముందా..? ఇలాంటి తనిఖీలు, విచారణలు ఎన్నికలప్పుడు ఇంకేమైనా జరిగాయా..? గడిచిన నాలుగేళ్లుగా చూసుకుంటే సెంట్రల్ ఏజెన్సీలు చేపడుతున్న ఈ దాడులు ఎన్నికల సమయంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకుల ఇళ్ల మీదనే ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. అవేంటో ఇక్కడ చూద్దాం.
మహారాష్ట్రలో..
– 2019 సెప్టెంబర్‌లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి ఈ కేసు నమోదైంది.
– 2019 ఆగస్టులో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై ఈడీ కేసు దాఖలు చేసింది. కోహినూర్ సీటీఎన్ఎల్ కంపెనీకి సంబంధించి ఆయన మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపణ. ఈ రెండు కేసుల్లో విచారణ ఇప్పటికీ కొనసాగుతున్నది. 2019 నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. అప్పుడు బీజేపీ శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.
కర్నాటకలో..
– 2017 ఆగస్టు 2 నుంచి 5 దాకా ట్రబుల్ షూటర్ గా పేరున్న ప్రస్తుత కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ ఇంటితో పాటు ఆయన ఆస్తులున్నాయని ఆరోపిస్తున్న మరో 70 చోట్ల ఐటీ శాఖ సోదాలు జరిపింది. ఆ సమయంలో ఆయన గుజరాత్‌కు చెందిన 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్టులో ఉంచారు. సరిగ్గా అదే టైంలో (ఆగస్టు 8) దివంగత నేత అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
– 2018లోనూ తన కంపెనీలలో పన్ను ఎగవేతలకు సంబంధించిన కేసులో శివకుమార్‌పై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేసి సోదాలు నిర్వహించాయి. 2018లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019 లోనూ ఇదే సీన్ రిపీటయ్యింది. అప్పుడు రాష్ట్రంలో ఉప ఎన్నికలున్నాయి.
మధ్యప్రదేశ్‌లో..
– 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బంధువుల ఇండ్ల మీద ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేపట్టింది.
ఛత్తీస్‌గఢ్‌లో..
– 2018 లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. సీడీ స్కాండల్‌కు సంబంధించిన కేసులో ఆయనతో పాటు జర్నలిస్టు వినోద్ వర్మపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తర్వాత వినోద్ అరెస్టు కూడా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
– 2018 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అప్పటి టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ల మీద ఈడీ కేసు నమోదు చేసింది. వారి ఆర్థిక కార్యకలాపాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ కేసులు నమోదయ్యాయి. ఆ తదనంతరం వీరిరువురు బీజేపీలో చేరారు. కేసులు అటకెక్కాయి.
పశ్చిమ బెంగాల్‌లో..
– 2020 ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యతో పాటు ఆయన కుటుంబసభ్యుల మీద సీబీఐ విచారణ చేపట్టింది. బొగ్గు కుంభకోణం కేసులో అభిషేక్‌తో సహా ఆయన భార్య, బావ, మామ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
– ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీ, మాజీ మంత్రి మదన్ మిత్రాలపై ఈడీ కేసులు దాఖలు చేసింది. వీరిరువురు చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిరువురూ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నారు.
– గతనెలలోనే శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో టీఎంసీ జొరసంకొ అభ్యర్థి వివేక్ గుప్తా పలుమార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు.
కేరళలో..
– ఈ ఏడాది జులైలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం. శివశంకర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రశ్నించింది.
– 2019 ఆగస్టులో సీపీఐ(ఎం) సెక్రెటరీ కె. బాలకృష్ణన్ ను ఈడీ అరెస్టు (మనీ లాండరింగ్ కేసులో) చేసింది.
– గతనెలలో కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బ్యాంక్ (కెఐఐఎఫ్‌బి) ప్రతినిధులను ఈడీ ప్రశ్నించింది. ఈ సంస్థకు సీఎం పినరయి విజయన్ చైర్మెన్ గా ఉన్నారు.