బతిమాలడంతోనే వైసీపీలోకి: ఎంపీ రఘరామకృష్ణం రాజు
దిశ, ఏపీ బ్యూరో: తాను ఎంత ఛీ కొట్టినా పట్టించుకోకుండా వైసీపీలోకి రావాలని బతిమాలడంతోనే ఆ పార్టీలో చేరానని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తాను వైసీపీలో చేరితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారంటేనే వెళ్లానని చెప్పారు. తానేమీ జగన్ ఛరిష్మాతో గెలవలేదని స్పష్టం చేశారు. తిరుపతి వెంకన్న భూముల వేలం, ఇసుక మాఫియా, పేదలకు ఇళ్ల స్థలాల […]
దిశ, ఏపీ బ్యూరో: తాను ఎంత ఛీ కొట్టినా పట్టించుకోకుండా వైసీపీలోకి రావాలని బతిమాలడంతోనే ఆ పార్టీలో చేరానని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తాను వైసీపీలో చేరితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారంటేనే వెళ్లానని చెప్పారు. తానేమీ జగన్ ఛరిష్మాతో గెలవలేదని స్పష్టం చేశారు.
తిరుపతి వెంకన్న భూముల వేలం, ఇసుక మాఫియా, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అక్రమ వసూళ్లు, భూముల కొనుగోళ్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని కొంతకాలంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతుంటే సొంత పార్టీ వాళ్లే నొచ్చుకుంటున్నారని ఆరోపించారు. దీంతో సొంత పార్టీ నుంచే తనపై విమర్శలు వస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీలో ఓ విచిత్రమైన సిద్ధాంతం ఉందని అన్నారు.
ఇతర పార్టీల్లోని ఎవరినైనా తిట్టాలంటే వారి సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీ నేతలతో తిట్టిస్తారని వెల్లడించారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్‌ను ఏమైనా అనాలంటే తమ పార్టీలోని ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనో, మరొకరితోనే మాట్లాడిస్తారని చెప్పారు.
ఇప్పుడు తనపై కూడా అదే తీరులో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుతో మాట్లాడిస్తున్నారని అన్నారు. జగన్ దయతో 20 రోజుల్లో ఎంపీనయ్యానని, జగన్ వల్లే పార్లమెంటు కమిటీ చైర్మన్ అయ్యానని ప్రసాదరాజు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, తాను ఇతరుల సాయంతో గెలవలేదని చెప్పారు. ఆఖరుకి పార్లమెంటు కమిటీ చైర్మన్ పదవి కూడా తనకు ఇవ్వలేదనీ, ఎవరికి ఇచ్చారో తెలుసని అన్నారు. ఆ పదవి తనకు ప్రధాని ఇచ్చారని ఆయన చెప్పారు.
‘మీరొస్తేనే మాకు సీట్లు పెరుగుతాయంటేనే పార్టీలో చేరాన’ని చెప్పారు. నరసాపురం టీడీపీకి కంచుకోట కనుక ఇక్కడ్నించి తననే పోటీ చేయాలని కోరితే వైసీపీలో చేరానని స్పష్టం చేశారు. జగన్ బొమ్మ పెట్టుకుని నెగ్గామని ఎమ్మెల్యేలు చెప్పుకోవచ్చు కానీ, తన వల్లకూడా స్థానిక ఎమ్మెల్యేలు విజయం సాధించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.